INDW vs BANW : బంగ్లాను చిత్తు చేసిన భారత్‌.. సెమీస్‌ ఆశలు సజీవం

కీలకమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ 110 పరుగుల భారీ తేడాతో..

Updated : 22 Mar 2022 14:57 IST

పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి టీమ్‌ఇండియా

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఆశలు సెమీస్‌ సజీవం.. కీలకమైన మ్యాచ్‌లో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. చివరి మ్యాచ్‌లోనూ గెలుపొందితే ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకునే అవకాశం ఉంది. మార్చి 27న దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తలపడనుంది. ఆసీస్‌ (12), దక్షిణాఫ్రికా (8), భారత్‌ (6), వెస్టిండీస్‌ (6) పాయింట్లతో ఉన్నాయి.

స్నేహ్‌ రాణా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 119 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సల్మా ఖతున్‌ (32)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4, పూజ వస్త్రాకర్‌ 2, ఝులన్ గోస్వామి 2.. రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ చెరో వికెట్ తీశారు.

అదరగొట్టిన బౌలర్లు

ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా వికెట్లు తీస్తూ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. రాజేశ్వరి గైక్వాడ్ తొలి వికెట్‌ తీసి బ్రేక్‌ ఇవ్వగా.. ఆ తర్వాత స్నేహ్‌ రాణా (4/30) చెలరేగింది. బంగ్లా బ్యాటర్ సల్మా (32) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లలో షర్మిన్‌ 5, ఫర్గనా హక్ డకౌట్, నిగర్ 3, రుమానా 2, లతా మోందల్ 24, రితు మోని 16, ఫహిమా 1, జహనర అలామ్‌ 11* పరుగులు చేశారు. 

రాణించిన యస్తిక

ఓపెనర్లు స్మృతీ మంధాన (30), షెఫాలీ వర్మ (42) మంచి ఆరంభం ఇచ్చారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితోపాటు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగడంతో కష్టాల్లో పడినట్లు అనిపించింది. అయితే యస్తిక (50)తో హర్మన్‌ ప్రీత్ కౌర్ (14) కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించింది. అయితే, అనవసర పరుగుకు యత్నించి హర్మన్‌ పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్ (26), పూజా వస్త్రాకర్ (30), స్నేహ్ రాణా (27) రాణించారు. బంగ్లా బౌలర్లలో రితు మోని 3, నహిదా 2, జహనర ఒక వికెట్ పడగొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని