T20 World Cup: భారత్‌Xపాక్‌.. పైచేయి మనదే.. ఎప్పుడెలాగంటే?

ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ల వివరాలు

Updated : 22 Oct 2021 14:16 IST

దాయాదుల పోరంటేనే భావోద్వేగాలతో ముడిపడి ఉండే అంశం. ఎప్పుడెప్పుడా అని యావత్‌ ప్రపంచం వీరి మధ్య మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. సరిహద్దుల  వద్ద  ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల ఊసే లేదు. ఐసీసీ మెగా టోర్నమెంట్లలో అయినా తలపడితే చూద్దామనుకునే ప్రేక్షకులు మాత్రం కోకొల్లలు. అలాంటి అభిమానుల కోసం టీ20 ప్రపంచకప్‌ వేదిక కానుంది. అక్టోబర్ 24న తొలి మ్యాచ్‌లో పాక్‌తో టీమిండియా తలపడనుంది. 

ఇప్పటి వరకు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎక్కువగా దాయాది జట్టునే  విజయం వరించింది. అయితే అన్ని ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో మాత్రం పాకిస్థాన్‌ మీద టీమిండియాదే పైచేయి. వన్డే వరల్డ్‌కప్‌లు సహా టీ20 ప్రపంచకప్‌  మ్యాచుల్లో పాక్‌పై భారత్‌ దే సంపూర్ణ ఆధిపత్యం. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు.. టీ20 వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఢీకొన్నాయి. అన్నింట్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఈ ఆదివారం మళ్లీ తలపడనున్న నేపథ్యంలో ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో గత జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుందాం.. 

ఎన్ని మ్యాచుల్లో తలపడ్డాయి..?

కొన్నేళ్ల కిందట వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సహిస్తుండడంతో ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్‌ నిరాకరించడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అయితే క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి ఇరు జట్లు 199 మ్యాచ్‌ల్లో ఢీకొనగా.. భారత్‌ 70 మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ 86 విజయాలను నమోదు చేసింది. మరో 42 మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగిశాయి. ఇందులో 59 టెస్టులు ఆడగా.. భారత్‌ 9, పాకిస్థాన్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. 38 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అలానే 132 వన్డేల్లో టీమిండియా 55, పాకిస్థాన్‌ 73 మ్యాచుల్లో గెలుపొందగా.. నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో ఆధిక్యం మాత్రం భారత్‌దే. ఎనిమిది మ్యాచుల్లో ఆరు టీమిండియా‌, ఒకే ఒక్క మ్యాచ్‌లో పొరుగు దేశం గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది.


టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో మనమే విజేతలం..

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేసి మరీ టైటిల్‌ను భారత్‌ ఎగరేసుకుపోయింది. అయితే ఆ టోర్నీలో రెండుసార్లు ఈ రెండు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. గ్రూప్‌ స్టేజ్‌లో మ్యాచ్‌ టైగా ముగియడంతో బౌలౌట్‌లో పాక్‌పై భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాలో ఉతప్ప (50), ఎంఎస్ ధోనీ (33), ఇర్ఫాన్‌ పఠాన్‌ (20) రాణించారు. దీంతో 141/9 స్కోరు వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం లక్ష్య ఛేదనలో మిస్బాఉల్‌హక్ (53), షోయబ్ మాలిక్ (20) పోరాటంతో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 141 పరుగులే చేయగలిగింది. చివరి రెండు బంతులకు ఒక్క పరుగు అవసరం కాగా.. పాక్‌ చేతిలో ఒక వికెట్‌ మాత్రమే ఉంది. అయితే అప్పటికే ఫామ్‌లో ఉన్న మిస్బా రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ బౌలౌట్‌కు దారి తీసింది. బౌలౌట్‌లో మనవాళ్లు ఇరగదీశారు. సూటిగా వికెట్లను గిరాటేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, రాబిన్ ఉతప్ప వికెట్లను గురి చూసి కొట్టగా.. పాక్‌ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో 3-0 తేడాతో బౌలౌట్‌లో టీమిండియా విజయం సాధించింది.


ఫైనల్‌లోనూ హడలెత్తించిన మిస్బా..

గ్రూప్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌ను గెలిపించినంత పని చేసిన మిస్బాఉల్‌ హక్‌ ఫైనల్‌లోనూ తన జట్టును విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడ్డాడు. అయితే ఎంఎస్ ధోనీ సారథ్యం ముందు పాకిస్థాన్‌ తలవంచక తప్పలేదు. తుదిపోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (75), రోహిత్ శర్మ (30) రాణించారు. అనంతరం 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 152 పరుగులకే ఆలౌటైంది. ఆర్పీ సింగ్‌ (3/26), ఇర్ఫాన్‌ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) అద్భుత బౌలింగ్‌తో భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. జోగిందర్ శర్మ తొలి బంతిని వైడ్‌ వేశాడు. రెండో బాల్‌కు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని మిస్బా సిక్స్‌గా మలిచాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో ఆరు పరుగులు సాధించాల్సి వచ్చింది. అయితే జోగిందర్ వేసిన నాలుగో బంతిని మిస్బా స్కూప్‌ చేయగా.. షార్ట్ ఫైన్‌లెగ్‌లో ఉన్న శ్రీశాంత్‌ ఒడిసి పట్టడంతో తొలి టీ20 ప్రపంచకప్‌ భారత్‌ వశమైంది.

2009, 2010 టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ముఖాముఖిగా ఢీకొనలేదు. 2009లో భారత్‌ సూపర్‌-8 స్టేజ్‌లోనే నిష్క్రమించగా.. పాక్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2010లోనూ టీమిండియా సూపర్‌-8కే పరిమితమైంది. పాకిస్థాన్‌ సెమీస్‌ వరకు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 


రెండు ఎడిషన్ల తర్వాత.. 

తొలి టీ20 ప్రపంచకప్‌ (2007)లో రెండుసార్లు పోటీ పడిన భారత్, పాకిస్థాన్‌ జట్లు మళ్లీ 2012 టీ20 ప్రపంచకప్‌లోనే ఎదురుపడటం విశేషం. సూపర్‌-8 స్టేజ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (78) ఒంటి చేత్తో విజయాన్నందించాడు. అయితే మిగిలిన మ్యాచుల్లో భారత్‌ ఓడిపోవడం, నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో ఆసీస్, పాక్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. భారత్‌ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.


సూపర్‌-10లో భారత్‌ ఆధిపత్యం.. 

2014 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-10కి భారత్‌ చేరుకుంది. అదే గ్రూప్‌లో పాకిస్థాన్‌ ఉండటంతో మళ్లీ దాయాదుల పోరు తిలకించే భాగ్యం ప్రేక్షకులకు దక్కింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను 131/7 స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం బ్యాటర్లు సమయోచిత ఇన్నింగ్స్‌లతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. గ్రూప్‌లోనే టాప్‌లో నిలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌ ఫైనల్‌కు చేరింది. ఏడేళ్ల తర్వాత టైటిల్ నిరీక్షణకు తెరపడుతుందేమోనని భావించినా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియా 130/4 స్కోరు చేయగా.. లంక కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మరో కప్‌ను సొంతం చేసుకోవాలనే ఆశ అలాగే మిగిలిపోయింది.


స్వదేశంలోనూ పాక్‌పై టీమిండియాదే హవా 

అసలే స్వదేశం.. 2016 టీ20 ప్రపంచ కప్‌ ఒకే గ్రూప్‌లో భారత్, పాక్‌ ఉన్నాయంటే అభిమానులకు పండగే. అప్పటికే ప్రపంచకప్‌ పోటీల్లో పాక్‌పై టీమిండియాదే ఆధిపత్యం. మరోసారి తలపడే అవకాశం రానే వచ్చింది. దీంతో సర్వత్రా ఆసక్తి. అలాంటి మ్యాచ్‌లోనూ భారత్‌ హవా కొనసాగించింది. ఇదే గ్రూప్‌లో అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో టీమిండియా (79) తక్కువ పరుగులకే ఆలౌట్‌ కావడంతో పాక్‌తో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారత్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈడెన్ గార్డెన్స్‌లో అవుట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 118/5 స్కోరుకే భారత్‌ కట్టడి చేసింది. అనంతరం టీమిండియా నాలుగు వికెట్లను నష్టపోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే సెమీఫైనల్‌లో భారత్‌కు భంగపాటు తప్పలేదు. వెస్టిండీస్‌ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట టీమిండియా 192/2 భారీ స్కోరు సాధించింది. అయితే విండీస్‌ బ్యాటర్ల ముందు భారత బౌలర్లు తేలిపోయారు. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని వెస్టిండీస్‌ ఛేదించింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ నెల 24న జరిగే మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని