Updated : 29 Jul 2022 23:58 IST

IND vs WI: మెరిసిన భారత బౌలర్లు.. తొలి టీ20లో విండీస్‌ చిత్తు

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో పొట్టి సిరీస్‌లోనూ తొలి విజయం సాధించి శుభారంభం చేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేసింది. దీంతో భారత్‌ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్‌ షమర్హ్‌ బ్రూక్స్‌ (20) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్‌ ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో భారత్‌ సునాయాస విజయం సాధించింది. అశ్విన్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ తలో రెండు వికెట్లు తీయగా భువనేశ్వర్‌, జడేజా ఒక్కో వికెట్‌ తీశారు.

అర్ధ శతకంతో మెరిసిన రోహిత్‌..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (64; 44 బంతుల్లో 7x4, 2x6) అర్ధ శతకంతో మెరవగా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన సూర్యకుమార్‌ (24; 16 బంతుల్లో 3x4, 1x6) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా త్వరగా పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే, హోసీన్‌ వేసిన ఐదో ఓవర్‌లో సూర్య ఔటయ్యాడు. తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (0) కూడా నిరాశ పరిచాడు. అయితే, రిషభ్‌ పంత్‌ (14), రోహిత్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ, కీమోపాల్‌.. ఓ అద్భుతమైన డెలివరీకి పంత్‌ను ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ 88 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే అల్‌జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్య (1) సైతం పెవిలియన్‌ చేరాడు.

మెరుపు ముగింపునిచ్చిన దినేశ్‌ కార్తీక్‌..

తర్వాత రవీంద్ర జడేజా (16) కాస్త పోరాడినా కీలక సమయంలో జోసెఫ్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అప్పటికే అర్ధ శతకం సాధించిన రోహిత్‌ సైతం ధాటిగా ఆడే క్రమంలో హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 138/6గా ఉంది. ఈ క్రమంలోనే చివర్లో వచ్చిన దినేశ్ కార్తీక్‌ (41 నాటౌట్‌; 19 బంతుల్లో 4x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (13 నాటౌట్‌; 10 బంతుల్లో 1x6)తో కలిసి దంచికొట్టాడు. వీరిద్దరూ చివరి 25 బంతుల్లో 52 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3,443) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలవడమే కాకుండా 27వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్తిల్‌ (3,399)ను వెనక్కినెట్టాడు. విండీస్‌ బౌలర్లలో అల్‌జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు తీయగా మెకాయ్‌, హోల్డర్‌, హోసీన్‌, కీమో పాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని