IND vs AUS: ఆసీస్‌పై ఘన విజయం.. తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా!

ఆసీస్‌పై అన్ని విభాగాల్లోనూ విజృంభించిన భారత్‌ (IND vs AUS) మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారీ స్కోరు నమోదు చేసిన భారత్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

Updated : 25 Sep 2023 10:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్‌ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇందౌర్‌ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 399/5 స్కోరు చేసింది. అనంతరం ఆసీస్‌ను 217 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వర్షం కారణంగా ఛేదనను 33 ఓవర్లకు కుదించారు. భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్‌లు, 30 ఫోర్లు బాదారు. ఇందులో సూర్యకుమార్‌ ఒక్కడే ఆరేసి సిక్స్‌లు, ఫోర్లు కొట్టడం విశేషం. ఈ క్రమంలో టీమ్‌ఇండియా అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో 3000కిపైగా సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులూ నమోదయ్యాయి. 

  • ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు (18) బాదడం ఇది ఐదోసారి. గతంలో ఆసీస్‌పైనే (2013లో) 19, కివీస్‌పై (2023లో) 19, బెర్ముడాపై (2007లో) 18, కివీస్‌పై (2009లో) 18 సిక్స్‌లను భారత బ్యాటర్లు కొట్టారు. మొత్తం వన్డే చరిత్రలో భారత్‌ 3007 సిక్స్‌లతో కొనసాగుతోంది.
  • ఇందౌర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు చేసిన అత్యధిక స్కోర్లలో ఇది రెండోది కావడం విశేషం. 2012లో వెస్టిండీస్‌పై 418/5 స్కోరు చేసింది. అయితే, ఇప్పుడు చేసిన 399/5 స్కోరు ఆసీస్‌పై అత్యధికం. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్ - శ్రేయస్ అయ్యర్ రెండో వికెట్‌కు సరిగ్గా 200 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. వీరిద్దరూ సెంచరీలు సాధించారు.
  • ఆసీస్‌పై ప్రస్తుతం మరో మ్యాచ్‌ ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఆసీస్‌పై ఏడో వన్డే సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఇందులో స్వదేశంలో ఆరు ఉండగా.. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌ను గెలుచుకుంది. 
  • ఇందౌర్‌ వేదికగా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ భారత్‌ విజయం సాధించింది. ఇలా ఒక వేదికపై ఓటమి అనేది లేకుండా విజయాలను నమోదు చేసిన నాలుగో జట్టు టీమ్‌ఇండియా. న్యూజిలాండ్‌ 9 విజయాలు (డునెదిన్‌ స్టేడియం), పాకిస్థాన్‌ 8 విజయాలు (బులవాయో), పాకిస్థాన్‌ 7 విజయాలు (అక్కడి హైదరాబాద్‌ స్టేడియం).
  • ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. ఆసీస్‌పై అశ్విన్ 144 వికెట్లు తీయగా.. ఆసీస్‌పైనే అనిల్ కుంబ్లే 142, పాక్‌పై కపిల్‌ 141 వికెట్లు పడగొట్టారు.
  • ఆసీస్‌పై ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోర్ల జాబితాలో (399/5) ఇది నాలుగోది.  2018లో ఆసీస్‌పై ఇంగ్లాండ్ 481/6 అత్యధిక స్కోరు కావడం విశేషం. దక్షిణాఫ్రికా (438/9, 416/5) రెండు సార్లు 400కిపైగా చేసింది. 
  • ఒకే ఓవర్‌లో అత్యధికంగా పరుగులు ఇచ్చిన ఐదో ఆసీస్‌ బౌలర్‌గా కామెరూన్ గ్రీన్ నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లోని 44వ ఓవర్‌లో సూర్యకుమార్‌ నాలుగు సిక్స్‌లు బాదేశాడు. మరో రెండు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో మొత్తం 26 పరుగులు సమర్పించాడు. సైమన్ డెవిస్, క్రెయిగ్‌ మెక్‌డార్మెట్, దోహర్తి, ఆడమ్‌ జంపా కూడా గతంలో 26 పరుగులు ఇచ్చుకున్నారు. 
  • అదేవిధంగా అత్యంత ఎక్కువగా తన పది ఓవర్ల కోటాలో పరుగులు ఇచ్చిన మూడో ఆసీస్ బౌలర్‌ కామెరూన్ గ్రీన్‌ (2/103). దక్షిణాఫ్రికాపై మిక్‌ లూయిస్‌ (2006లో) 0/113), దక్షిణాఫ్రికాపై ఆడమ్ జంపా (0/113) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 
  • ఒక మ్యాచ్‌లో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. ఆసీస్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఐదో బ్యాటర్‌గా సీన్ అబాట్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అబాట్ 5 సిక్స్‌లు కొట్టాడు. అందరికంటే ఎక్కువగా జేమ్స్ ఫాల్కనర్ 2013లో భారత్‌పైనే ఆరు సిక్స్‌లు బాదాడు. 
  • తొమ్మిదో వికెట్‌కు ఆసీస్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన మూడో జోడీగా సీన్‌ అబాట్ - జోష్ హేజిల్‌వుడ్ (77 పరుగులు) నిలిచారు. జేమ్స్‌ ఫాల్కనర్ - క్లింట్‌ 2013లో భారత్‌పై 115 పరుగులు జోడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని