Taniya bhatia: హోటల్‌ రూమ్‌లో నా బ్యాగు చోరీ చేశారు: తానియా భాటియా

హోటల్‌లో తన బ్యాగు చోరీకి గురైందని జట్టు సభ్యురాలు తానియా భాటియా చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

Published : 27 Sep 2022 00:42 IST

దిల్లీ: భారత బౌలర్‌ దీప్తి శర్మ రనౌట్‌ చేసిన విధానం (మన్కడింగ్‌) వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా టీమ్‌ఇండియా మహిళల జట్టు మరోసారి వార్తల్లో నిలిచింది. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ కోసం ఈ జట్టు ఇటీవల లండన్‌ వెళ్లింది. అక్కడ తాము బస చేసిన హోటల్‌లో తన బ్యాగు చోరీకి గురైందని జట్టు సభ్యురాలు తానియా భాటియా చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా సోమవారం వెల్లడించింది. 

‘‘లండన్‌ పర్యటనలో భాగంగా మారియెట్‌ హోటల్‌లో బస చేశాను. ఆ సమయంలో ఎవరో నా రూమ్‌లోకి వచ్చి బ్యాగును దొంగిలించారు. అందులో విలువైన కార్డులు, నగదు, ఆభరణాలు ఉన్నాయి. క్రికెటర్లకు సైతం భద్రత లేకపోవడం చాలా షాకింగ్‌గా , బాధగానూ ఉంది. ఇటువంటి హోటల్‌ను ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మాకు కేటాయించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ విషయంపై వెంటనే స్పందించి విచారణ చేపట్టాలి. ఇప్పటికైనా సరైన భద్రతా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని పేర్కొంటూ హోటల్‌ యాజమాన్యంతో పాటు బీసీసీఐ, ఈసీబీని ట్యాగ్‌ చేసింది. ఈ ట్వీట్‌ వైరల్‌ కావడంతో మారియెట్‌ హోటల్‌ యాజమాన్యం వెంటనే స్పందించింది. తానియాకు క్షమాపణలు చెబుతూ దీనిపై తక్షణమే విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ‘మహిళా క్రికెటర్లకు భద్రత కల్పించడంలో ఇంత నిర్లక్ష్యమా?’ అంటూ నెటిజన్లు ఇరుదేశాల క్రికెట్‌ బోర్డులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని