Rishabh Pant: రిషభ్‌ పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌..!

రోడ్డు ప్రమాదానికి గురైన పంత్‌(Rishabh Pant)ను ఒక బస్సుడ్రైవర్‌ తొలుత చూసి కాపాడాడు. పంత్‌ అప్పుడు నడవలేని స్థితిలో ఉన్నట్లు చెప్పాడు. 

Updated : 30 Dec 2022 16:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌(Rishabh Pant)ను ఓ బస్సు డ్రైవర్‌ ప్రమాదం నుంచి కాపాడాడు. శుక్రవారం తెల్లవారుజామున రూర్కీ సమీపంలో పంత్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆటుగా వెళుతున్న బస్సు డ్రైవర్‌ సుశీల్‌ మాన్‌ ఈ ఘటన చూసిన తొలివ్యక్తి. అప్పటికే కారుకు మంటలు అంటుకోవడంతో అతడిని బయటకు తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. పంత్‌ తీవ్రంగా గాయపడి నడిచేందుకు కూడా ఇబ్బంది పడినట్లు చెప్పాడు.

ఆ సమయంలో తాను హరిద్వార్‌ వైపు నుంచి వస్తుండగా.. పంత్‌ (Rishabh Pant)వాహనం దిల్లీ వైపు నుంచి వస్తోందని సుశీల్‌ పేర్కొన్నాడు. ‘‘పంత్‌కారు డివైడర్‌ను ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లింది. దీంతో వెంటనే నా బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రమాదం జరిగిన కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాను. తొలుత కారు బోల్తాపడిందనుకొన్నాను. పంత్‌ అప్పటికే కారు విండో నుంచి సగం బయటకు వచ్చాడు. తానొక క్రికెటర్‌నని చెప్పాడు. అతడి తల్లికి ఫోన్‌ చేయమని కోరాడు. నేను క్రికెట్‌ చూడను. అందుకే గుర్తుపట్టలేకపోయాను. కానీ, నా బస్సులోని వారు గుర్తుపట్టారు. అతడిని వెంటనే బయటకు లాగి.. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో చూశాను. అతడి నీలం రంగు బ్యాగ్‌, రూ.7,000 నగదును గుర్తించాం. వాటిని అంబులెన్స్‌లో అతడికి అప్పగించాం’’ అని పేర్కొన్నాడు.

తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. పంత్‌(Rishabh Pant) నుదురు చిట్లినట్లు, వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశమైనట్లు ఎక్స్‌రేల్లో తెలిసినట్లు పేర్కొంది. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బీసీసీఐ తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని