IND vs AUS: బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!

ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఆసీస్‌తో మూడో మ్యాచ్‌ (IND vs AUS) కోసం సిద్ధమవుతోంది. రాజ్‌కోట్‌ వేదికగా బుధవారం జరగనున్న మ్యాచ్‌కు గిల్, శార్దూల్ దూరం కాగా.. రోహిత్, విరాట్, హార్దిక్, బుమ్రా జట్టులోకి వచ్చేయనున్నారు.

Published : 26 Sep 2023 17:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను (IND vs AUS) గెలుచుకోవడం కంటే భారత ఆటగాళ్లు కీలక సమయంలో ఫామ్‌ను అందిపుచ్చుకోవడమే అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా బలమైన ఆస్ట్రేలియాను ఏమాత్రం వెరకుండా ఢీకొట్టిన వైనం మాత్రం ప్రపంచ కప్ (ODI World Cup 2023) ఆడే ముందు కొండంత ఆత్మవిశ్వాసం నింపడం ఖాయం. ఇదే క్రమంలో ఆసీస్‌తో మూడో వన్డేకి సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా మరో అరుదైన ఘనత సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగే ముందు భారత్ ఆడబోయే చివరి సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌ ఇదే కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య మూడో మ్యాచ్‌కు  (బుధవారం) అందుబాటులోకి వచ్చేస్తారు. రెండో వన్డే ఆడని జస్‌ప్రీత్ బుమ్రా కూడా చివరి మ్యాచ్‌ కోసం రాజ్‌కోట్‌ చేరుకున్నాడు. అయితే, ఆసీస్‌పై భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావించింది. అతడితోపాటు శార్దూల్ కూడా రెస్టు తీసుకోనున్నాడు.

అలా జరిగితే..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పుడు భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌నూ గెలిస్తే టీమ్‌ఇండియా ఖాతాలో అరుదైన ఘనత వచ్చి చేరుతుంది. తొలిసారి ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం భారత్ ఎదుట ఉంది. ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీసుల్లో కొన్నింటిని టీమ్‌ఇండియా గెలిచినా.. క్లీన్‌స్వీప్‌ మాత్రం చేయలేదు. ఇలా భారత క్రికెట్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించొచ్చు. వరల్డ్‌ కప్ బరిలోకి దిగేముందు ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం వల్ల భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెగా టోర్నీలో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో (అక్టోబర్ 8న) ఆసీస్‌తోనే తలపడనుంది. 

ఓపెనింగ్‌ ఎవరు?

మూడో వన్డేలో శుభ్‌మన్‌ గిల్ విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మకు తోడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించేదెవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే, ఐదో స్థానంలో ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ ఎలానూ ఉన్నాడు. గిల్‌కు బదులు ఇషాన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వస్తారు. బౌలింగ్‌ విభాగంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తుది జట్టులో ఎవరు ఉంటారు? ఎందుకంటే రాజ్‌కోట్ వేదిక కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగితే.. జడేజాతోపాటు మరోసారి అశ్విన్‌ను ఎంపిక చేయొచ్చు. అశ్విన్‌కు పరీక్ష పెట్టినట్లూ ఉంటుంది. పేస్‌ బాధ్యతలు మాత్రం హార్దిక్‌తోపాటు బుమ్రా, సిరాజ్‌దే. 

మ్యాచ్‌ షెడ్యూల్‌.. పిచ్‌

ఇంతకుముందు అనుకున్నట్లుగానే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. గత మూడు వన్డేల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజేతగా నిలిచింది. సగటున మూడొందలకుపైగా స్కోరు నమోదు కావచ్చు. గత మ్యాచ్‌ జరిగిన ఇందౌర్ స్టేడియం కంటే రాజ్‌ కోట్‌ కాస్త పెద్దదే అయినా.. పరుగుల ప్రవాహం ఉంటుందని విశ్లేషకుల అంచనా. మ్యాచ్‌ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందుగా వేస్తారు. మ్యాచ్‌కు వర్షం ముప్పు అస్సలు ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది.

అశ్విన్‌ వరల్డ్‌ కప్‌లో ఉన్నట్లే!

వరల్డ్‌ కప్‌ కోసం తొలుత అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. అయితే ఆసియా కప్‌లో అతడు గాయపడ్డాడు. ఇప్పటికీ ఫిట్‌నెస్‌ సాధించలేదు. గురువారం నాటికి (సెప్టెంబర్ 28) కూడా కోలుకోవడం కష్టమే. దీంతో సీనియర్‌ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ తప్పకుండా స్క్వాడ్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పటికే ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. మూడో వన్డేలోనూ అవకాశం వచ్చి రాణిస్తే మాత్రం అతడికి తిరుగుండదు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో సూర్య, శ్రేయస్‌, కేఎల్ రాహుల్‌ కుదురుకోవడంతో ఇంకేం మార్పులు ఉండకపోవచ్చు. మొన్నటి వరకు శ్రేయస్‌, సూర్య ఫామ్‌ విషయంలోనే ఆందోళన ఉన్నప్పటికీ.. వాటికి తమ బ్యాటింగ్‌తోనే సమాధానం ఇచ్చారు. వరల్డ్‌ కప్‌ కోసం ఏమైనా మార్పులు చేసి తుది జట్టును ప్రకటించాల్సిన గడువు సెప్టెంబర్ 28. మూడో వన్డేలో ప్రదర్శన ఆధారంగా ఒకటీ లేదా రెండు మార్పులు ఉండొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని