T20 World Cup 2024: ఇంకో అడుగేస్తే..

టీ20 ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ ఎంతో కొంత తడబడుతున్నా, తర్వాత పుంజుకుని విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోతున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తు ముంగిట నిలిచింది.

Updated : 22 Jun 2024 07:04 IST

సెమీస్‌పై భారత్‌ కన్ను 
నేడు బంగ్లాతో సూపర్‌-8 పోరు
రాత్రి 8 నుంచి


టీ20 ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ ఎంతో కొంత తడబడుతున్నా, తర్వాత పుంజుకుని విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోతున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తు ముంగిట నిలిచింది. సూపర్‌-8లో ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన రోహిత్‌ సేన.. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే దాదాపుగా సెమీస్‌ బెర్తు భారత్‌ సొంతమైనట్లే.

నార్త్‌ సౌండ్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో అఫ్గానిస్థాన్‌పై విజయంతో శుభారంభం చేసిన భారత్‌.. ఒక్క రోజు విరామంలో మరో పోరుకు సిద్ధమైంది. శనివారం రోహిత్‌ సేన.. బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. బలాబలాలు చూసినా, టోర్నీలో ప్రదర్శన చూసినా.. ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. బంగ్లాదేశ్‌ తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో మట్టికరిచింది. కానీ ప్రపంచ క్రికెట్లో పెద్ద జట్లను బంగ్లా ఓడించిన సందర్భాలెన్నో. భారత్‌పైనా చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయాలు సాధించింది. ఆ జట్టుకిది చావోరేవో మ్యాచ్‌ కాబట్టి గట్టిగానే పోరాడుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి రోహిత్‌సేన జాగ్రత్తగా ఉండాల్సిందే.

టాప్‌ మారేనా?

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇప్పటిదాకా ఓటమే లేదు. కానీ జట్టు ప్రదర్శన మాత్రం సంతృప్తికరంగా లేదు. ఎక్కువగా బౌలర్ల ప్రతిభతోనే గెలుస్తున్న భారత్‌కు బ్యాటింగ్‌ ఆందోళనగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ల ఫామ్‌ కలవరపెడుతోంది. ఐపీఎల్‌లో అదరగొట్టి టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా ఆడుతున్న కోహ్లి.. ఒక్కసారీ బ్యాట్‌ ఝళిపించలేదు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 5 పరుగులే చేసిన అతను.. అఫ్గాన్‌తో సూపర్‌-8 మ్యాచ్‌లో ఎక్కువసేపు క్రీజులో ఉన్నా సౌకర్యంగా లేడు. 24 పరుగులే చేశాడు. గ్రూప్‌ దశ వైఫల్యం తర్వాత సూపర్‌-8లో అయినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తాడనుకుంటే నిరాశపరిచాడు. బంగ్లాపై అయినా అతను ఫామ్‌ అందుకుంటాడేమో చూడాలి. మరో ఓపెనర్, కెప్టెన్‌ రోహిత్‌ ఫామ్‌ కూడా అంతంతమాత్రమే. ఐర్లాండ్‌పై సాధించిన అర్ధశతకం మినహా అన్ని మ్యాచ్‌ల్లో వైఫల్యమే. తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఓపెనర్లు జోరందుకోవడం చాలా అవసరం. మిడిలార్డర్లో శివమ్‌ దూబె వైఫల్యం భారత్‌కు సమస్యగా మారింది. అతడి స్థానంలో జైస్వాల్‌ను ఓపెనింగ్‌లో ఆడించి కోహ్లి తనకు అలవాటైన మూడో స్థానంలో ఆడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రోహిత్‌ జట్టు యాజమాన్యం ఈ దిశగా ఆలోచిస్తుందేమో చూడాలి. సూర్యకుమార్, పంత్, హార్దిక్‌ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యల్లేవు. పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌ నిలకడగా రాణిస్తున్నారు. అక్షర్, జడేజాలకు తోడైన కుల్‌దీప్‌ స్పిన్‌ బలాన్ని పెంచాడు. శనివారం కూడా భారత్‌ ఇదే కూర్పును అనుసరించవచ్చు.

బంగ్లా బలంగానే..

కాగితంపై బంగ్లాదేశ్‌ బలంగానే కనిపిస్తోంది. టోర్నీలో ఆ జట్టు బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. తంజిద్‌ హసన్, ముస్తాఫిజుర్, తస్కిన్‌లతో పేస్‌ విభాగం.. మెహిదీ హసన్, రిషాద్, షకిబ్‌లతో స్పిన్‌ విభాగం మెరుగ్గా కనిపిస్తున్నాయి. కానీ బంగ్లా బ్యాటర్లే టోర్నీలో తేలిపోతున్నారు. ఓపెనర్లు తంజిద్, లిటన్‌ దాస్‌లతో పాటు కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో నిలకడ అందుకోవట్లేదు. మిడిలార్డర్లో హృదాయ్, మహ్మదుల్లా, షకిబ్‌ పర్వాలేదు. మరి చావోరేవో మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లా బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

పిచ్‌ ఎలా?

నార్త్‌ సౌండ్‌పిచ్‌ సమతూకంతో ఉంటుంది. బ్యాటర్లు నిలదొక్కుకుంటే బాగా షాట్లు ఆడొచ్చు, పరుగులు చేయొచ్చు. బౌలర్లకు కూడా పిచ్‌ నుంచి సహకారం ఉంటుంది. ఆరంభంలో పేసర్లు, తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. 

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె/జైస్వాల్, హార్దిక్, జడేజా, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, బుమ్రా.

బంగ్లాదేశ్‌: తంజిద్, లిటన్, నజ్ముల్‌ శాంటో (కెప్టెన్‌), తౌహిద్, షకిబ్, మహ్మదుల్లా, మెహదీ హసన్, రిషాద్, తస్కిన్, ముస్తాఫిజుర్, తంజిమ్‌ హసన్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని