IND vs NZ: అతి పెద్ద స్టేడియంలో.. అత్యంత కీలక పోరుకు వేళాయె..!

 భారత్ - న్యూజిలాండ్‌ జట్ల (IND vs NZ) మధ్య కీలకమైన పోరుకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా మారింది. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 01 Feb 2023 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య కీలకమైన పోరు.. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌.. మరి వేదిక ఎక్కడో తెలుసు కదా...? అతిపెద్ద క్రికెట్ స్టేడియాల్లో అదొకటి. దాదాపు 1.32 లక్షల మంది కూర్చొని వీక్షించేంత భారీ మైదానం. 2015లో స్టేడియం మొత్తాన్ని మూసి వేసి.. కొంత భాగం కూల్చేసి మరీ పునర్‌నిర్మించారు. దాదాపు ఐదేళ్లపాటు సాగిన ఈ పనులు 2020 నాటికి పూర్తయ్యాయి. దీని కోసం రూ. 800 కోట్లను వెచ్చించడం విశేషం. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం అహ్మదాబాద్‌ స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం జరిగింది. మరి ఇలాంటి మైదానంలో కీలకమైన పోరు జరిగే క్రమంలో ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన అత్యధిక, అత్యల్ప స్కోర్లు.. బౌండరీ లైన్‌ దూరం, పిచ్‌ రిపోర్ట్‌, ఇరు జట్ల ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకొందాం.. 

బ్యాటింగ్‌కు అనుకూలమే.. కానీ

నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని పిచ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. అదే సమయంలో స్పిన్‌కూ సహకరిస్తుందని క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే లఖ్‌నవూ పిచ్‌ మాదిరిగా మరీ ఎక్కువగా టర్నింగ్‌ ఉండదని.. క్రీజ్‌లో కుదురుకుంటే భారీ స్కోర్లే నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 174 పరుగులు. ఇక్కడ జరిగిన ఆరు మ్యాచుల్లో తొలిసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు మూడు సార్లు, ఛేదన చేసిన జట్టు మూడు సార్లు గెలవడం విశేషం. బ్యాటింగ్‌కు సంబంధించి అభిమానులకు తప్పకుండా వినోదం లభిస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్‌లో చాలామ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. ఛేదనకూ ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మంచు ప్రభావం ఉండటం వల్ల తొలుత టాస్‌ నెగ్గే జట్టు తప్పకుండా బౌలింగ్‌నే ఎంచుకొంటుంది. భారీ స్కోరు ఇచ్చినా సరే లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అత్యధిక స్కోరు 224/2 కాగా.. అత్యల్ప స్కోరు 124/2గా నమోదయ్యాయి. ఇంగ్లాండ్‌పై భారత్‌ 224 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్‌పైనే భారత్‌ అత్యల్పంగా 124/7 స్కోరు చేయడం గమనార్హం.

బౌండరీ లైన్‌లు ఇలా.. 

నరేంద్ర మోదీ స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ చాలా ఎక్కువ. అయితే ఆట జరిగే అవుట్‌ఫీల్డ్ మాత్రం చిన్నదే అని చెప్పొచ్చు. ఎందుకంటే స్క్వేర్‌ బౌండరీలు కేవలం 60 మీటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక వికెట్‌కు ముందు, వెనుక బౌండరీ లైన్లు మాత్రం పెద్దవే. వీటి లెంగ్త్‌ దాదాపు 75 మీటర్లు ఉన్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి మిస్టర్ 360 ఆటగాడు వికెట్లకు వెనుక వైపు నుంచి ఆడే స్కూప్‌ షాట్లకు సిక్స్‌లు పెద్దగా రాకపోయినా.. బౌండరీలను మాత్రం రాబట్టే అవకాశం ఉంది. లాంగాఫ్, లాంగాన్‌ దూరంగా ఉండటం వల్ల పేసర్లకు అనుకూలంగా ఉండొచ్చు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇషాన్‌ కిషన్‌కు ఇక్కడ మంచి రికార్డే ఉంది. ఇంగ్లాండ్‌పై 165 పరుగుల లక్ష్య ఛేదనను భారత్‌ ఆడుతూపాడుతూ 18 ఓవర్లలోపే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ హాఫ్ సెంచరీ బాదాడు. తొలి రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడిన ఇషాన్‌.. మళ్లీ ఫామ్‌ అందుకోవడానికి ఇదొక అవకాశంగా భావించాలి. ఈ స్టేడియంలో సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యకూ మంచి రికార్డే ఉంది.

కివీస్‌తో జాగ్రత్త..

తొలి రెండు మ్యాచుల్లోనూ భారత టాప్‌ ఆర్డర్‌ను త్వరగా పెవిలియన్‌ చేర్చిన కివీస్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్, రాహుల్ త్రిపాఠికి జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కివీస్‌ స్పిన్‌ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు ఔట్ కావడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేసే అంశం. క్లిష్టమైన సందర్భంలో ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆటతీరు. ఎప్పుడూ దూకుడుగా ఆడే సూర్య కీలకమైన సమయంలో సంమయనం పాటించి మరీ జట్టును గెలిపించాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఈసారి కూడా న్యూజిలాండ్‌ తన పార్ట్‌ టైమ్‌ బౌలర్లను రంగంలోకి దింపడం మాత్రం ఖాయం. ఎందుకంటే లఖ్‌నవూ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది. అందులో ఐదుగురు స్పిన్నర్లే ఉండటం గమనార్హం. ‘మిషన్ 2024’లో భాగంగా వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ కోసం జట్టును సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా ఆడగలిగే అనుభవం ఆటగాళ్లు పొందాలి. 

తుది జట్టు కూర్పుపై తీవ్ర కసరత్తు.. 

ఇరు జట్లూ తమ తుది ఆటగాళ్లు ఎవరనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తాయి. అయితే కివీస్‌ జట్టుకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చుగానీ.. భారత్‌కు మాత్రం 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం సవాల్‌తో కూడుకున్నదే. శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పృథ్వీ షాకు హార్దిక్‌ అవకాశం ఇస్తాడో లేదో తెలియాలంటే మ్యాచ్‌ వరకు ఆగాల్సిందే. పృథ్వీ టీ20లకు సరిగ్గా సరిపోతాడని, అతడికి ఛాన్స్‌ ఇవ్వాల్సిందేనని మాజీ క్రికెటర్లు ఘంటాపథంగా చెబుతున్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండబోతుందనే సంకేతాల నేపథ్యంలో హార్దిక్‌ మరోసారి ఉమ్రాన్‌ను బెంచ్‌కే రిజర్వ్‌ చేసి అర్ష్‌దీప్‌, శివమ్‌ మావితో కలిసి పేస్‌ బౌలింగ్‌ను పంచుకొంటాడు. చాహల్‌, సుందర్, కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్ హుడాతో కూడిన స్పిన్‌ బౌలింగ్‌ దుర్భేద్యంగా ఉంది.  ఈ సిరీస్‌ ముగిశాక.. ఆసీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లు ఉంటాయి. ఆ తర్వాత ఐపీఎల్‌ రానుంది. కాబట్టి, తమ స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ విజయం చాలా కీలకం. 

జట్లు (అంచనా): 

భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్‌ మావి, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవన్‌ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్‌ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఐష్‌ సోధి, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్‌ టిక్నెర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని