IND vs PAK: పాక్‌ మాజీ పేసర్‌కు హర్భజన్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

హర్భజన్‌ సింగ్‌, మహమ్మద్‌ అమిర్‌ మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం

Published : 28 Oct 2021 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అయితే ముగిసింది కానీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, పాక్‌ మాజీ పేసర్‌ మహమ్మద్‌ అమిర్ ట్విటర్‌ వేదికగా పరస్పరం ట్వీట్ల దాడి చేసుకున్నారు. దుబాయ్‌ వేదికగా గత ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియాపై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌ పోటీల్లో దాయాది దేశం తొలి విజయాన్ని సాధించి గత రికార్డును చెరిపేసింది. 

ఈ క్రమంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అమిర్ పాత వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అందులో హర్భజన్‌ బౌలింగ్‌లో షాహిద్‌ అఫ్రిది వరుసగా సిక్సర్లు బాదినట్లు ఉంది. దీంతో భజ్జీ.. 2010 ఇంగ్లాండ్‌, పాకిస్థాన్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమిర్‌ వేసిన ‘నో బాల్’ క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేశాడు. దానికి ‘‘ప్రజలు నిన్ను చూసేది డబ్బు కోసం పాకులాడేవాడిగానే. గౌరవం, అభిమానం ఏమీ లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. మీ దేశ ప్రజలు మద్దతుదారులకు ఎంత లభించిందో మీరు చెప్పరు. క్రికెట్‌ను ఈ విధంగా అవమానించి.. ప్రజలను ఫూల్స్ చేసిన నీలాంటివారితో మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది’’ ట్వీట్‌ పెట్టాడు. దానితోపాటు మహమ్మద్‌ అమిర్‌ బౌలింగ్‌లో భజ్జీ సిక్సర్‌ బాది టీమిండియాను గెలిపించిన వీడియోను పోస్టు చేసి ‘‘ ఫిక్సర్‌కి సిక్సర్‌.. ఇక పద పోదాం’’ అన్నట్లుగా క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే అప్పటి పాక్ ఆటగాళ్లైన మహమ్మద్‌ అమిర్‌తోపాటు మహమ్మద్‌ అసిఫ్‌, సల్మాన్‌ భట్ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. అమిర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు 2016లో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అవకాశం కల్పించింది. అయితే 29 ఏళ్ల వయసులోనే గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు అమిర్‌ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని