Team India: టీమ్‌ఇండియాకు మరో జహీర్‌ ఖాన్‌ దొరికేశాడు: పాక్‌ మాజీ కీపర్‌

టీమ్‌ఇండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను పాక్‌ మాజీ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్ అభినందించాడు. దక్షిణాఫ్రికాపై ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను జహీర్‌ ఖాన్‌తో పోల్చాడు.

Updated : 01 Oct 2022 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పవర్‌ప్లేతోపాటు డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బంతులను సంధిస్తోన్న టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్ ప్రశంసించాడు. తొలుత భారత టీ20 లీగ్‌లో ఉత్తమంగా రాణించిన అర్ష్‌దీప్‌ జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు. ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌ టీమ్‌ఇండియాకు కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక కావడం విశేషం. ఇటీవల ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకొన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ను అప్పటి పేసర్ జహీర్‌ ఖాన్‌తో పోలుస్తూ కమ్రాన్ అక్మల్ విశ్లేషించాడు. 

‘‘అర్ష్‌దీప్‌ అద్భుతమైన బౌలర్. పేస్‌, స్వింగ్‌ రెండింటినీ రాబట్టగలడు. అంతేకాకుండా మానసికంగా చాలా స్ట్రాంగ్‌. తన సామర్థ్యంపై అతడికి ఎంతో నమ్మకముంది. పరిస్థితులకు అనుగుణంగా అస్త్రాలను ఎలా వాడాలో తెలుసు. అందుకే టీమ్‌ఇండియాకు కొత్త జహీర్‌ ఖాన్‌ దొరికాడని భావిస్తున్నా. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. రొస్సొసౌ, డికాక్‌, మిల్లర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఇందులో డేవిడ్‌ మిల్లర్‌ వికెట్‌ ప్రత్యేకం. షార్ప్‌ ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఎంతో పరిణతిగా బంతులను సంధించాడు. భారత్‌కు ఇది శుభసూచికం. ఎందుకంటే జహీర్‌ ఖాన్‌ వంటి లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలర్‌ భారత్‌కు అవసరమైన సందర్భంలోనే అర్ష్‌దీప్‌ దొరికాడు’’ అని కమ్రాన్ అక్మల్‌ తెలిపాడు. అర్ష్‌దీప్‌ ఇప్పటి వరకు భారత్‌ తరఫున 12 టీ20లను ఆడగా.. 7.44 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 3/12.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని