T20 World CUP: భారత్‌ సెమీస్‌ అవకాశాలు.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కచ్చితంగా సెమీస్‌కు చేరుకొంటుందని పలువురు మాజీలు చెబుతుండగా.. కపిల్‌ దేవ్ మాత్రం మరోలా చెప్పడం గమనార్హం.  

Published : 20 Oct 2022 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొదటి రౌండ్‌లో భాగంగా అర్హత మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో (అక్టోబర్ 22) నుంచి సూపర్-12 పోరు ప్రారంభం కానుంది. సెమీస్‌కు చేరే నాలుగు జట్లలో టీమ్‌ఇండియా తప్పకుండా ఉంటుందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్న వేళ.. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ మాత్రం విభిన్నంగా స్పందించాడు.  టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు చేరుకొనే అవకాశం భారత్‌ జట్టుకు 30 శాతం మాత్రమేనని వ్యాఖ్యానించాడు. 

‘‘టీ20 ఫార్మాట్‌ క్రికెట్‌లో భారత్‌ ఒక విజయం సాధిస్తే.. మరొక మ్యాచ్‌లో ఓటమిపాలవుతోంది. ఇలాంటి స్థితిలో జట్టుపై నమ్మకం ఉంచుకోవడం చాలా కష్టం. పొట్టి కప్‌ అవకాశాలపై చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ ప్రధానాంశం టాప్‌-4లో నిలిచి సెమీస్‌కు చేరుకుంటుందా..? లేదా..? అదే నాకు కూడా ఆందోళనగా ఉంది. ఎవరేమి చెప్పినా నా అభిప్రాయం ప్రకారం భారత్ సెమీస్‌కు వెళ్లేందుకు 30 శాతం మాత్రమే అవకాశం ఉంది. అలాగే ఆల్‌రౌండర్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు. టీమ్‌ఇండియాకు హార్దిక్‌ పాండ్య ఉపయోగపడతాడు. ఇలాంటి ప్లేయర్లు జట్టుకు అదనపు బలం. ఆరో బౌలర్ లోటును తీరుస్తారు. అలాగే మంచి బ్యాటర్‌ కూడా. హార్దిక్‌ మాదిరిగానే రవీంద్ర జడేజా సరైన ఆల్‌రౌండర్‌. మా కాలంలో చాలా మంది ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండేవాళ్లు. అలాగే సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ప్రపంచకప్‌లో కీలకంగా మారతాడు. రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీతోపాటు సూర్యకుమార్‌ ఉండటం వల్ల బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది’’ అని కపిల్ తెలిపాడు. భారత్‌ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న (ఆదివారం) తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు