IND vs SA: ఆటగాళ్ల అనుభవమే.. టీమ్‌ ఇండియాకు కలిసొస్తుంది: ఆమ్లా

ప్రస్తుత టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా జట్టు కంటే బలంగా ఉందని మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా అన్నాడు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ సమష్టిగా రాణించి విజయం సాధించిందని..

Published : 01 Jan 2022 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా జట్టు కంటే బలంగా ఉందని మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా అన్నాడు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ సమష్టిగా రాణించి విజయం సాధించిందని పేర్కొన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే తొలి టెస్టులో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. 

‘గత రెండేళ్లుగా టీమ్‌ఇండియా విదేశాల్లో గొప్ప విజయాలు సాధిస్తోంది. అనుభవమున్న ఆటగాళ్లు ఉండటం భారత్‌కి కలిసొస్తుంది. భారత్‌తో పోల్చుకుంటే దక్షిణాఫ్రికా జట్టులో దాదాపు అందరూ కొత్తవాళ్లే ఉన్నారు. కెప్టెన్ డీన్ ఎల్గర్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి మాత్రమే కాస్త మెరుగ్గా రాణిస్తున్నారు. సెంచూరియన్‌లో పిచ్‌ పాతబడుతున్న కొద్ది బ్యాటింగ్‌ చేయడం సవాల్‌గా మారుతుంది. అందుకే, తొలి టెస్టులో టాస్‌ గెలిచిన వెంటనే భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగ్గా రాణించడంతో.. మా జట్టు వెనుకబడిపోయింది. మొదటి రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. దానికి తోడు టీమ్‌ఇండియా బ్యాటర్లు కూడా చాలా పద్ధతిగా బ్యాటింగ్‌ చేశారు. అయినా వికెట్ల కోసం బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించారు. టెంబా బవుమా రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ గొప్పగా పోరాడాడు. మా జట్టు తొలి టెస్టులో పరాజయం పాలైనా.. తర్వాతి టెస్టుల్లో పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. ఇప్పటి వరకు సొంత గడ్డపై ఓడిపోలేదు. మా ఆటగాళ్లు ఆ రికార్డును అలాగే కొనసాగిస్తారనుకుంటున్నాను. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్, ఐడెన్‌ మార్‌క్రమ్‌ రాణిస్తే.. విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు’ అని ఆమ్లా అన్నాడు. జనవరి 3 నుంచి జొహాన్నెస్ బర్గ్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు