Asia Cup : టీమ్‌ఇండియాకు షాక్‌.. రాహుల్‌కు కరోనా పాజిటివ్‌

మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం దాయాదుల మధ్య పోరు జరగనుంది. యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొనేందుకు...

Published : 23 Aug 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఆదివారం దాయాదుల మధ్య పోరు జరగనుంది. యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొనేందుకు జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి ఉంది. దానికి కారణం ద్రవిడ్‌ కరోనా బారిన పడటం. యూఏఈ వెళ్లే ముందు నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే పాక్‌తో తొలి మ్యాచ్ ఆగస్టు 28 నాటికి ద్రవిడ్ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడిన టీమ్‌ఇండియాకు రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్ మాంబ్రేకు సెలెక్షన్‌ కమిటీ ఆ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత్ జట్టును ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య వంటి సీనియర్లకు అవకాశం కల్పించింది. అయితే గాయం కారణంగా కీలక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్, షమీ మెగా టోర్నీకి దూరమయ్యారు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా అక్షర్‌ పటేల్, దీపక్‌ చాహర్, శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకుంది. ఒకవేళ ద్రవిడ్ అందుబాటులోకి రాకపోతే.. జింబాబ్వేతో సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్‌ ఆసియా కప్‌లోనూ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని