India @ Olympics: ఇప్పటికీ భారత్‌దే ఆ రికార్డు

ఒలింపిక్స్‌.. ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారిణి పాల్గొనాలనుకునే విశ్వ క్రీడల వేదిక. అక్కడ పాల్గొంటే దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినట్టే. అక్కడ పతకం గెలిస్తే దేశం గర్వించినట్టే. 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన...

Updated : 23 Jul 2021 09:35 IST

ఒలింపిక్స్‌లో భారత ప్రయాణం..

ఒలింపిక్స్‌.. ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారిణి పాల్గొనాలనుకునే విశ్వ క్రీడల వేదిక. అక్కడ పతకం గెలిస్తే దేశం గర్వించినట్టే. 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ క్రీడల్లో భారత్‌ తరఫున ఇప్పటికే వందల మంది పాల్గొన్నారు. కానీ, పతకాలు సాధించి మాత్రం 28. అందులో 9 బంగారు, 7 రజతం, 12 కాంస్యం ఉన్నాయి. కాగా, నేటి నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడ భారత ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి తెలుసుకుందాం.


బ్రిటిష్‌-ఇండియన్‌ తొలి పతకం..

ఈ విశ్వక్రీడలు తొలిసారి నిర్వహించింది 1896 ఏథెన్స్‌లో. అయితే, భారత్‌ నుంచి ప్రాతినిధ్యం మొదలైంది మాత్రం 1900 ఫ్రాన్స్‌ ఒలింపిక్స్‌ నుంచి. అప్పట్లో నార్మన్‌ గిల్బర్ట్‌ ప్రిచర్డ్‌ అనే బ్రిటిష్‌-ఇండియన్‌ తొలిసారి భారత్‌ తరఫున ఈ విశ్వ క్రీడల్లో పాల్గొని రెండు విభాగాల్లో రజత పతకాలు సాధించాడు. దాంతో ఆయన భారత్‌ నుంచే కాకుండా ఆసియా నుంచే ఒలింపిక్స్‌లో తొలిసారి పతకాలు సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.


భారత్‌ గర్వపడే క్షణాలు..

1900 తర్వాత భారత్‌ మళ్లీ ఈ అతిపెద్ద క్రీడా సంగ్రామంలో ప్రాతినిధ్యం వహించింది 1920 బెల్జియం ఒలింపిక్స్‌లో. అంటే 20 ఏళ్ల తర్వాత. అప్పుడు భారత్‌ తొలిసారి నలుగురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్‌లను అక్కడికి పంపించింది. కానీ, అందులో ఏ ఒక్కరూ పతకం సాధించలేకపోయారు. అనంతరం జరిగిన 1924 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ 12 మందితో వెళ్లిన భారత బృందం ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. ఈ క్రమంలోనే తర్వాతి కాలంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఏర్పడి 1928 ఒలింపిక్స్‌ నాటికి ఏడుగురు అథ్లెట్లతో సహా భారత హాకీ జట్టును పంపించింది. అక్కడ మన భారత హాకీ జట్టు తొలిసారి బంగారు పతకం సాధించింది. అప్పటి నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు ఈ ఆటలో ఏకఛత్రాధిపతిగా నిలిచి రికార్డు సృష్టించింది.


పడిలేచిన కెరటంలా..

అయితే, 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆపై 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మళ్లీ విజేతగా నిలిచి బంగారు పతకం సాధించింది. తర్వాత ప్రభావం కోల్పోయిన హాకీ జట్టు 1968 మెక్సికో ఒలింపిక్స్‌, 1972 మునిచ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యాలు సాధించింది. ఆపై 1976 మోంట్రియల్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి పూర్తిగా విఫలమై ఏ పతకమూ సాధించలేకపోయింది. అయితే, 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పడిలేచిన కెరటంలా ఎగిసిపడి బంగారు పతకం తిరిగి సాధించింది. కాగా, భారత్‌కు హాకీలో ఇదే చివరి పతకం కావడం విచారకరం. అప్పుడు వాసుదేవన్‌ భాస్కరన్‌ నేతృత్వంలో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌గా నిలిచింది. తర్వాత అంతకంతకూ ప్రభావం కోల్పోయి నామమాత్రపు జట్టుగా కొనసాగుతోంది. మరోవైపు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే  ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుదే ఇప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన. మొత్తం 8 సార్లు బంగారు పతకాలు, ఒకసారి రజతం, రెండు సార్లు కాంస్యం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.


పతకం కోసం 16 ఏళ్ల నిరీక్షణ..

1980 తర్వాత భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో వరుసగా మూడుసార్లు ఒక్క పతకం కూడా సాధించకుండా ఇంటిముఖం పట్టారు. దాంతో ఈ విశ్వ క్రీడల్లో భారత అథ్లెట్లపై నమ్మకం పోయింది. కానీ, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ కాంస్యం సాధించి 16 ఏళ్ల తర్వాత భారత్‌కు ఊరట కలిగించాడు. ఈ క్రమంలోనే 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అతడు భారత్‌ తరఫున వ్యక్తిగత పతకం కైవసం చేసుకోవడం విశేషం. అంతకుముందు 1952లో డీకే జాధవ్‌ బాంటమ్‌ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌ తరఫున వ్యక్తిగతంగా కాంస్యం సాధించాడు. ఆ తర్వాత లియాండరే ఈ ఘనత సాధించాడు. ఇక 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు. దాంతో భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.


ఎవరూ ఊహించని విధంగా..

2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 73 మంది అథ్లెట్లను పంపించింది. అందులో ఒక్కరే రజతం సాధించారు. అది కూడా ఎవరూ ఊహించని విధంగా పురుషుల డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌ విభాగంలో రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ రెండో స్థానంలో నిలిచి ఆ ఘనత నమోదుచేశారు. దాంతో భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో తొలి రజతం సాధించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఇక 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ మొత్తం 57 మంది అథ్లెట్లను చైనాకు పంపించగా తొలిసారి మూడు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో అప్పటివరకు భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించాడు. భారత్‌ తరఫున వ్యక్తిగతంగా బంగారు పతకం సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. మరోవైపు రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌ కాంస్యం సాధించి 1952 (కేడీ జాధవ్‌) తర్వాత ఈ విభాగంలో రెండో పతకం సాధించిన రెజ్లర్‌గా సత్తా చాటాడు. అదే సమయంలో బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ సైతం కాంస్యం సాధించి భారత్‌కు మూడో పతకం అందించాడు.


భవిష్యత్‌పై ఆశలు రేపిన ఒలింపిక్స్‌..

ఇక 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ మరింత జోరు పెంచింది. ఈసారి మొత్తం 83 మందిని విశ్వ క్రీడలకు పంపించగా అత్యద్భుత ప్రదర్శన కనబర్చింది. మొత్తం ఆరు పతకాలు సాధించి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించింది. రెండు రజతం, నాలుగు కాంస్యాలతో ఒలింపిక్స్‌లో తొలిసారి ఈ ఘనత సాధించింది. షూటింగ్‌లో విజయ్‌ కుమార్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ విభాగంలో రజతం సాధించాడు. అలాగే గగన్‌ నారంగ్‌ పురుషుల పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. దాంతో అతడు కాంస్యం సాధించాడు. అదే సమయంలో రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌ 66 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్‌లో రజతం సంపాదించాడు. బ్యాడ్మింటన్‌ మహిళల సింగింల్స్‌లో సైనా నెహ్వాల్‌, బాక్సింగ్‌ మహిళల ఫ్లై వెయిట్‌ విభాగంలో మేరీకోమ్‌, రెజ్లింగ్‌ పురుషుల ఫ్రీస్టైల్‌లో యోగేశ్వర్‌ దత్‌ కాంస్యాలతో అదరగొట్టారు.


అనుకున్నదానికి భిన్నంగా..

అయితే, 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌ మరింత మంచి ప్రదర్శన చేస్తుందని ఆశించగా పూర్తిగా నిరాశపర్చింది. ఏకంగా 117 మంది అథ్లెట్లను పోటీలకు పంపగా కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించింది. అది కూడా ఇద్దరు మహిళలు కైవసం చేసుకోవడం విశేషం. మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు రెండో స్థానంలో నిలిచి రజతం సంపాదించింది. మహిళల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్‌ కాంస్యం నెగ్గింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పలువురు క్రీడాకారులు త్రుటిలో పతకాలు కోల్పోయారు. అందులో సానియా మిర్జా, రోహన్‌ బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ ఉండగా, అభినవ్‌ బింద్రా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో హాఫ్‌ పాయింట్‌తో పతకం కోల్పోయాడు. మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న దీపా కర్మాకర్‌ సైతం నిరాశపర్చడం చేదు అనుభవం. ఇప్పుడు మరోసారి టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమైన భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ 127 మందిని జపాన్‌కు పంపింది. కానీ, గతంలో కంటే ఈసారి క్రీడాకారులు బలంగా కనిపిస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరూ మంచి ప్రదర్శన చేసి మరిన్ని పతకాలతో తిరిగి రావాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీతో సహా క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని