T20 World Cup: శుభారంభం ఎక్కడ?

టీ20 క్రికెట్లో ఓపెనర్లు రాణించడం జట్టుకు ఎంతో కీలకం. ఎందుకంటే తొలి 6 ఓవర్ల పవర్‌ప్లేలో పరిస్థితులను ఉపయోగించుకుని ఓపెనర్లు సత్తాచాటితే జట్టు భారీ స్కోరుకు పునాది పడుతుంది.

Updated : 21 Jun 2024 07:15 IST

టీ20 క్రికెట్లో ఓపెనర్లు రాణించడం జట్టుకు ఎంతో కీలకం. ఎందుకంటే తొలి 6 ఓవర్ల పవర్‌ప్లేలో పరిస్థితులను ఉపయోగించుకుని ఓపెనర్లు సత్తాచాటితే జట్టు భారీ స్కోరుకు పునాది పడుతుంది. అలాగే ఛేదనలోనూ చెలరేగితే విజయం సులువవుతుంది. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌కు శుభారంభం దక్కడం లేదు. ఓపెనర్లుగా ఆడుతున్న రోహిత్, కోహ్లి వైఫల్యమే అందుకు కారణం. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 52 పరుగులు చేసిన రోహిత్‌ ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. మధ్యలో కెనడాతో మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. జరిగిన మిగతా మూడు మ్యాచ్‌ల్లో రోహిత్‌ వరుసగా 13, 3, 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన కోహ్లి ఈ ప్రతిష్ఠాత్మక పొట్టి కప్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అతను వరుసగా 1, 4, 0, 24 పరుగులు సాధించాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో కుదురుకున్నట్లు కనిపించిన కోహ్లి అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు. ఇక తొలి వికెట్‌కు ఇప్పటివరకూ వీళ్ల అత్యుత్తమ భాగస్వామ్యం 22 పరుగులు (ఐర్లాండ్‌పై) మాత్రమే. జట్టుకు ఆశించిన ఆరంభం దక్కడం లేదనడానికి ఇదే నిదర్శనం. ఈ మెగా టోర్నీ కోసం రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి మరీ కోహ్లీని మేనేజ్‌మెంట్‌ ఓపెనర్‌గా పంపిస్తోంది. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ జోడీపై విమర్శలు వస్తున్నాయి. రోహిత్, జైస్వాల్‌ను ఓపెనర్లుగా ఆడించి, కోహ్లీని మూడో స్థానంలోకే తిరిగి పంపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఓపెనర్ల వైఫల్యంతో ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై భారం పడుతుంది. ఆరంభంలో ఒకట్రెండు వికెట్లు కోల్పోతే పట్టు బిగించేందుకు ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్లే. పంత్, సూర్యకుమార్‌ ఆదుకుంటున్నారు కాబట్టి సమస్య తీవ్రత తెలియడం లేదు. ఒకవేళ వీళ్లు కూడా విఫలమైతే అప్పుడు ఓటమి దిశగా సాగాల్సి ఉంటుంది. సూపర్‌- 8లో ఇంకా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడాల్సి ఉంది. టీమ్‌ఇండియా ముందంజ వేస్తే ఆ తర్వాత సెమీస్, ఫైనల్‌ లాంటి కీలక మ్యాచ్‌లుంటాయి. ఈ నేపథ్యంలో ఓపెనర్లు రాణించడం జట్టుకు చాలా అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు