IND vs AUS: స్పిన్‌ను ఎదుర్కోవడం ఓ ఆర్ట్‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌లో అదే లోపించింది: వెంగ్‌సర్కార్‌

ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ (IND vs AUS) భారత్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆసీస్‌ బ్యాటర్లు విపరీతంగా ఇబ్బంది పడ్డారు.

Published : 22 Feb 2023 14:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) వరుసగా రెండు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా (Team India) చేతిలో ఆసీస్‌ ఓటమిపాలైంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి (IND vs AUS) దూసుకెళ్లింది. దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా ఆస్ట్రేలియా ఓడిపోవడంపై భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ (Dilip Vengsarkar) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియాతో పోలిస్తే ఆసీస్‌ బ్యాటర్ల నైపుణ్యం సరిపోలేదని పేర్కొన్నాడు. స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. స్వీప్‌ షాట్లను కొట్టి పరుగులు రాబడదామని ప్రయత్నించి విఫలమయ్యారని.. అందుకే స్పిన్‌ను ఆడేంత నైపుణ్యం వారి వద్ద లేదని వ్యాఖ్యానించాడు.

‘‘స్పిన్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేయడం ఓ ఆర్ట్‌. దురదృష్టవశాత్తూ ఆసీస్‌ బ్యాటర్లలో అదే లోపించింది. నాణ్యమైన స్పిన్‌ను ఎదుర్కోవడానికి సరైన విధానం అవలంబించలేదు. స్వీప్ చేయాలనే మీ ప్లానింగ్‌ బాగానే ఉన్నప్పటికీ.. కొద్దిపాటి పొరపాటు జరిగినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో హుక్‌ షాట్‌ కొట్టడం ఎంత కష్టమో.. స్పిన్‌లో ప్రతిసారి స్వీప్‌ చేయాలని అనుకోవడం కూడా ఇబ్బందే. ఫుట్‌వర్క్‌ చాలా దారుణంగా ఉంది. ఉత్తమ స్థాయి ఆటతీరు కనిపించలేదు. క్రీజ్‌లో నుంచి ముందుకొచ్చి.. ఆడిన బ్యాటర్‌ను చూడలేకపోయా. రివర్స్‌ స్వీప్‌ ద్వారా పరుగులు రాబట్టవచ్చని కొన్నిసార్లు అనుకోవచ్చు. బంతి మిస్‌ అయితే ఎల్బీగా వెనుదిరగక తప్పదు. డీఆర్‌ఎస్‌లు కూడా రక్షించలేవు. అందుకే, బాల్‌ టైమింగ్‌ను అర్థం చేసుకొని ఆడాలి’’ అని వెంగ్‌సర్కార్‌ తెలిపాడు. భారత్ - ఆసీస్‌ జట్ల మధ్య మార్చి 1 నుంచి మూడో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు