WTC Final: భారత్‌ గోల్డెన్‌ అవర్‌ను చేజార్చుకొంది: పాంటింగ్‌

భారత్‌ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో తొలి రోజు అందివచ్చిన అవకాశాలను చేజార్చుకొందని ఆసీస్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ విశ్లేషించాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు సిరాజ్‌ బౌలింగ్‌ ఆకట్టుకొందని పేర్కొన్నాడు.

Published : 09 Jun 2023 11:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌(WTC Final)లో భారత్‌ స్వయంకృతంతోనే పీకల్లోతు కష్టాల్లో పడిందని ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ ఆటగాడు రికీ పాంటింగ్‌(Ricky Ponting) విశ్లేషించాడు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి అందివచ్చిన సువర్ణావకాశాలను టీమ్‌ ఇండియా చేజార్చుకొందని పేర్కొన్నాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం నుంచే ఇబ్బందులు మొదలయ్యాయన్నాడు. ‘‘తొలి గంటలో లభించిన అవకాశాలను చేజార్చుకొనేలా వారు మరీ బలహీనంగా బౌలింగ్‌ చేశారు. వికెట్‌, మైదానం పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు సరికొత్త డ్యూక్‌ బాల్‌ చేతిలో ఉంది. పూర్తి శక్తియుక్తులతో బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి కుదురుకోకుండా చేయాలి. వారు భోజన విరామ సమయానికి నాలుగైదు ఆసీస్‌ వికెట్లను కూల్చాల్సింది. కానీ, వారు కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకొన్నారు. అదైనా ఫర్వాలేదు’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. 

ఇక టాస్‌ విషయంలో హిట్‌మ్యాన్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాంటింగ్‌ భిన్నంగా స్పందించాడు. ‘‘రోహిత్‌ టాస్‌ గెలిచిన తర్వాత ఫీల్డింగ్‌ ఎంచుకోవడం దూకుడైన నిర్ణయం. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకొన్నాక.. ఆశ్విన్‌ను పక్కనపెట్టి నలుగురు సీమర్లతో దిగడం ఒక్కటే ఆప్షన్‌. ఇది కేవలం కెప్టెన్‌ నిర్ణయం మాత్రమే కాదన్న విషయం నాకు తెలుసు. నిన్న మ్యాచ్‌కు ముందు కోచ్‌ ద్రవిడ్‌, రోహిత్‌ సుదీర్ఘ చర్చల్లో మునిగి ఉండటాన్ని చూశాను. వారు టాస్‌ విషయంలో నిర్ణయం ఎలా ఉండాలనే దానిపై చర్చలో ఉన్నారు. ఒక వేళ వారు బౌలింగ్‌ ఎంచుకొంటే మాత్రం నలుగురు సీమర్లతో బరిలోకి దిగాల్సిందే. ఇప్పటి వరకు ఆ నిర్ణయం ఏమాత్రం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పడే తేల్చడం తొందరపాటవుతుంది’’ అని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో యువ పేసర్‌ సిరాజ్‌ బౌలింగ్‌ పాంటింగ్‌ను ఆకట్టుకొంది. దీనిపై స్పందిస్తూ ‘‘అతడు( సిరాజ్‌) పోటీపడి బౌలింగ్‌ చేయడం చూడటానికి చాలా బాగుంది. ఏ స్థితిలోనైనా ఆటను గతి మార్చేయగలను అని చెప్పిన ఆటగాడు అతడొక్కడే. అతడు ఇన్నింగ్స్‌ ఆసాంతం పేస్‌ను కోల్పోకపోవడం నన్ను ఆకట్టుకొంది. నిన్న తొలి బంతి నుంచి నేటి మధ్యాహ్నాం వరకు అతడు సగటు గంటకు 86-87 మైళ్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్నాడు’’ అని పాంటింగ్‌ విశ్లేషించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు