IND vs PAK: పోరాడి ఓడిన భారత్‌.. ఉత్కంఠ పోరులో పాక్‌ విజయం

అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. చివరి ఓవర్‌ వరకు...

Published : 26 Dec 2021 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌కు పాకిస్థాన్‌ చేతిలో ఓటమి ఎదురైంది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై పాక్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్‌ బౌలర్ జీషన్‌ జమీర్‌ 5 వికెట్లతో చెలరేగడంతో.. భారత్‌ 49 ఓవర్లో 237 పరుగులకు ఆలౌటైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఛేదనలో పాక్‌ సరిగ్గా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది. 

చివరి వరకూ పోరాడినా..

మోస్తరు లక్ష్యంతో (238) బరిలోకి దిగిన పాకిస్థాన్‌కి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. భారత బౌలర్‌ రాజవర్థన్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్ వహీద్‌ (0) డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముహమ్మద్‌ షెహజాద్‌ (81) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టీమ్‌ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 159/5 (36 ఓవర్లు) స్కోరుతో నిలిచింది. ఇర్ఫాన్‌ ఖాన్‌ (32), రిజ్వాన్‌ మహమ్మద్‌ (29) ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. భారత బౌలర్‌ రాజ్‌ భవా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఆఖరి రెండు ఓవర్లో పాక్ విజయానికి 18 పరుగులు చేయాల్సి వచ్చింది. 49వ ఓవర్లో రాజవర్ధన్ వేసిన అహ్మద్‌ ఖాన్‌ ఓ ఫోర్, ఓ సిక్స్‌ బాదాడు. అయితే రవి కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికే జీషన్‌ జమీర్‌ ఔటయ్యాడు. దీంతో సమీకరణం ఐదు బంతుల్లో 8 పరుగులకు మారింది. తర్వాతి రెండు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు, ఐదు బంతులకు అహ్మద్‌
ఖాన్‌ రెండు డబుల్స్ తీశాడు. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండటంతో మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారింది. అయితే చివరి బంతిని అహ్మద్‌ ఖాన్‌ బౌండరీకి తరలించడంతో భారత్‌కి ఓటమి ఖాయమైంది. టీమ్‌ఇండియా బౌలర్లలో రాజ్‌ భవా 4, రాజవర్థన్‌, రవికుమార్, నిశాంత్‌ సంధు తలో వికెట్ పడగొట్టారు. 

ఆదుకున్న ఆరాధ్య యాదవ్‌

అంతకుముందు టాస్‌ ఓడి  బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. రఘువన్షి (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. పాక్‌ బౌలర్లు విజృంభించడంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, వికెట్ కీపర్‌ ఆరాధ్య యాదవ్‌ (50: 83 బంతుల్లో 3×4), కౌషల్ తంబే (32: 38 బంతుల్లో 4×4) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన రాజవర్థన్‌ (33: 20 బంతుల్లో 5×4,1×6) ధాటిగా ఆడాడు. దీంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది. పాక్‌ బౌలర్లలో జీషన్‌ జమీర్‌ 5, అవైస్‌ అలీ 2, ఖాసీమ్‌ అలీ, మాజ్‌ సదాఖత్ తలో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని