చెన్నె టెస్టు: భారత్‌ ఘోర ఓటమి.. 

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు...

Updated : 09 Feb 2021 14:33 IST

తిప్పేసిన జాక్‌ లీచ్‌

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 192 ఆలౌట్‌
విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌గిల్‌ అర్ధశతకాలు

ఫొటో: ఇంగ్లాండ్‌ ట్విటర్‌ 

చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఈ సిరీస్‌లో బోణి కొట్టింది. అండర్సర్‌ 3/17, లీచ్‌ 4/76 అద్భుత బౌలింగ్‌ చేశారు. భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (72; 104 బంతుల్లో 9x4), శుభ్‌మన్ ‌గిల్ ‌(50; 83 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలు సాధించి టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 

దెబ్బకొట్టిన అండర్సన్‌..

39/1 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న పుజారా(15), రహానె(0), పంత్‌(11), వాషింగ్టన్‌ సుందర్(0)‌ పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్‌ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా మరో ఎండ్‌ నుంచి సహకారం లేకపోయింది. మధ్యలో అశ్విన్‌(9; 46 బంతుల్లో 1x4) కాస్త తోడు నిలవడంతో ఏడో వికెట్‌కు 54 పరుగులు వచ్చాయి. తర్వాత మళ్లీ లయ అందుకున్న ఇంగ్లాండ్‌ బౌలర్లు భారత్‌ను 200లోపే కట్టడి చేశారు. ఉదయం బ్యాటింగ్‌ ఆరంభించిన గిల్‌, పుజారా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించారు. స్పిన్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ మ్యాచ్‌ను కాపాడేటట్లు అనిపించారు. ఈ క్రమంలోనే లీచ్‌ వేసిన ఓ చక్కటి బంతికి పుజారా ఔటయ్యాడు. బౌన్స్‌ అయిన బంతి బ్యాట్‌ అంచున తాకుతూ నేరుగా వెళ్లి స్లిప్‌లో ఉన్న స్టోక్స్‌ చేతిలో పడింది. దాంతో భారత్‌ 58 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

అనంతరం కోహ్లీ క్రీజులోకి రాగా, కాసేపటికే గిల్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఇక్కడే రూట్ తమ ప్రణాళికను అమలు పరిచాడు. బంతి స్వింగ్‌ అవుతుండడంతో అండర్సన్‌ను బరిలోకి దించాడు. అతడు ఒకే ఓవర్‌లో గిల్‌, రహానె(0)ను బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌పై ఇంగ్లాండ్‌ పట్టు సాధించింది. ఇక అక్కడి నుంచి ఒత్తిడికి గురైన టీమ్‌ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పంత్‌, వాషింగ్టన్‌ కూడా ఔటవ్వడంతో కోహ్లీ, అశ్విన్‌ కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత్‌ 144/6తో భోజన విరామానికి వెళ్లింది. తర్వాత కోహ్లీ అర్ధశతకం సాధించాక మళ్లీ ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించారు. లీచ్‌ ఓ చక్కటి డెలివరీతో అశ్విన్‌ను బుట్టలోకి వేసుకున్నాడు. ఆపై స్టోక్స్‌ కోహ్లీని బౌల్డ్‌ చేశాడు. దీంతో టీమ్‌ఇండియా ఓటమి ఖాయమైంది. చివరికి నదీమ్‌(0), బుమ్రా(4) త్వరగానే ఔటయ్యారు. 

స్కోర్‌ బోర్డు వివరాలు:

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 578 ఆలౌట్‌.. జోరూట్‌ 218, బుమ్రా 3/84

భారత్ తొలి ఇన్నింగ్స్‌: 337 ఆలౌట్‌.. పంత్‌ 91, బెస్‌‌ 4/76

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 178 ఆలౌట్‌.. జోరూట్‌ 40, అశ్విన్‌  6/61

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 192 ఆలౌట్‌.. కోహ్లీ 72, లీచ్‌ 4/76

ఇవీ చదవండి..

మ్యాచ్‌ ఎలా సాగిందంటే..

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సుమిత్‌ ఔట్‌
రెండో టెస్టుకు ఫ్యాన్స్‌.. నిబంధనలు తెలుసా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని