IND vs SA: సఫారీలదే ఆఖరి పంచ్‌.. సిరీస్‌ మాత్రం టీమ్‌ఇండియాదే

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 228 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా వెనుకబడింది. దీంతో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.

Updated : 04 Oct 2022 23:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే సిరీస్‌ దక్కిందనే అలసత్వమో.. బ్యాటర్ల నిర్లక్ష్యమో కానీ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మైదానం చిన్నదైనప్పటికీ కీలక బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 227/3 స్కోరు చేసింది. అయితే ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకొంది. అయితే ఈ ఓటమితో ఆధిక్యం 2-1కి తగ్గింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. 

కార్తిక్‌ మినహా.. నిరాశపర్చిన టాప్‌ బ్యాటర్లు

దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిన పిచ్‌ మీద టీమ్ఇండియా టాప్‌ ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్‌ రోహిత్ శర్మ (0) డకౌట్‌ కాగా.. శ్రేయస్‌ అయ్యర్ (1), సూర్యకుమార్‌ యాదవ్ (8), అక్షర్‌ పటేల్ (9) విఫలమయ్యారు. దినేశ్‌ కార్తిక్ (46: 4 సిక్స్‌లు, 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో మ్యాచ్‌పై అభిమానులకు కాస్త ఆశలు రేగాయి. కానీ స్వల్ప వ్యవధిలో రిషభ్ (27)‌, కార్తిక్‌, సూర్య ఔట్‌ కావడంతో ఆశలు నీరుగారాయి. అయితే చివర్లో దీపక్ చాహర్ (31), ఉమేశ్‌ యాదవ్‌ (20*) కీలకమైన 48 పరుగులు జోడించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ గాడిలో పడినట్లు అనిపించింది. 16 ఓవర్లకు 159/8 స్కోరుతో రేస్‌లోకి వచ్చినా... మరోసారి వికెట్లు పడిపోవడంతో భారత్‌ 178కే పరిమితమై ఓటమిపాలైంది. 

శతక్కొట్టిన రోసోవ్‌


 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. మరీ ముఖ్యంగా గత రెండు మ్యాచుల్లో విఫలమైన రిలీ రోసోవ్‌ (100*: 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం సాధించాడు. అదే విధంగా ఓపెనర్‌ క్వింటన్ డికాక్ (68: 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) జోరు కొనసాగించాడు. ట్రిస్టన్‌ స్టబ్స్ (23), డేవిడ్ మిల్లర్ (19*: 4 బంతుల్లో 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. బవుమా (3) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్, దీపక్ చాహర్ చెరో వికెట్‌ తీశారు. 

మ్యాచ్‌ విశేషాలు.. 

* ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రిలీ రోసోవ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు సూర్యకుమార్‌ యాదవ్‌

* పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్‌ఇండియా నెగ్గిన పదో ద్వైపాక్షిక సిరీస్‌ కావడం విశేషం. స్వదేశంలో ఏడో సిరీస్‌


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని