Hockey India: హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ఘోర ప్రదర్శన.. ప్రధాన కోచ్‌ రాజీనామా

హాకీ ప్రపంచకప్‌లో (Hockey World Cup 2023) భారత్‌ (Team India) నిరాశపరిచింది. కనీసం క్వార్టర్‌ ఫైనల్‌కు కూడా చేరుకోలేక ఇబ్బంది పడింది. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్‌ రాజీనామా చేశారు. 

Published : 30 Jan 2023 20:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్వదేశంలో జరిగిన హాకీ ప్రపంచకప్‌ 2023  మెగా టోర్నీలో టీమ్‌ఇండియా ‘క్రాస్‌ ఓవర్’ దశలోనే ఇంటిముఖం పట్టింది. భారీ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ ఫలితం మాత్రం అనుకొన్న విధంగా రాలేదు. దీంతో టీమ్‌ఇండియా హాకీ ప్రధాన కోచ్‌తో సహా ఇతర సిబ్బంది తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ప్రధాన కోచ్ గ్రాహమ్‌ రీడ్, విశ్లేషణ కోచ్‌ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్‌ డేవిడ్ పెంబెర్టన్‌ రాజీనామా చేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన రీడ్‌ 2019లో ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.  గ్రాహమ్‌ రీడ్‌ మార్గదర్శకంలో టీమ్‌ఇండియా అద్భుత విజయాలనే నమోదు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ప్రపంచకప్‌లో విఫలం కావడంతో రీడ్ రాజీనామా నిర్ణయం తీసుకొన్నారు. ‘‘నేను ప్రధాన కోచ్‌ పదవి నుంచి దిగిపోవడానికి సరైన సమయం ఇదేననిపిస్తోంది. నా బాధ్యతలను తర్వాత వచ్చే మేనేజ్‌మెంట్‌కు అప్పగిస్తా. హాకీ ఇండియా జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయడం గర్వకారణంగా ఉంది. ప్రతి క్షణం నేను ఎంతో ఆనందించా. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు. రీడ్‌ తన రాజీనామా లేఖను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీకి సమర్పించారు.

ఇంగ్లాండ్, స్పెయిన్‌, వేల్స్‌ జట్లతో కలిసి టీమ్‌ఇండియా గ్రూప్‌ -డిలో ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం బరిలోకి దిగింది. గ్రూప్‌ దశలో రెండో స్థానంలో నిలవడంతో న్యూజిలాండ్‌తో ‘క్రాస్‌ ఓవర్’ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చింది. అక్కడ ఓటమి ఎదురుకావడంతో కనీసం క్వార్టర్‌ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. చివరికి అర్జెంటీనాతో కలిసి 9వ స్థానంతో టోర్నీని ముగించింది. డిఫెన్స్‌, ఎటాకింగ్‌ బాగానే ఉన్నప్పటికీ.. పెనాల్టీలను గోల్స్‌గా మలచడంలో ఘోరంగా విఫలం కావడంతోనే భారత్ ఇంటిముఖం పట్టిందని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు