IND vs SA : ఇంకా మెరుగైన గణాంకాలు నమోదు చేయాలి : శార్దూల్ ఠాకూర్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు (7/61) నమోదు చేశానని భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ అన్నాడు. అయితే, ఇంతకంటే మెరుగైన ప్రదర్శన చేసే సత్తా...

Updated : 05 Jan 2022 10:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు (7/61) నమోదు చేశానని భారత బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ అన్నాడు. అయితే, ఇంతకంటే మెరుగైన ప్రదర్శన చేసే సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయడంలో శార్దూల్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

‘నా టెస్టు కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. కానీ, ఇంత కంటే మెరుగ్గా రాణించే సత్తా ఉంది. తొలి టెస్టు జరిగిన సెంచూరియన్‌లో, రెండో టెస్టు జరుగుతోన్న జొహన్నెస్‌బర్గ్‌లోనూ పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తోంది. దీంతో సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ వికెట్లు పడగొట్టాను. సీనియర్‌ బౌలర్లు బుమ్రా, మహమ్మద్‌ షమి కూడా వికెట్ల కోసం శాయశక్తులా శ్రమించారు. ప్రస్తుతం మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ పిచ్‌పై చివరి రెండు రోజులు బ్యాటింగ్‌ చేయడం సులభం కాదు. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో సఫారీల ముందు వీలైనంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటున్నాం’ అని శార్దూల్ అన్నాడు.

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 229 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం ఛెతేశ్వర్‌ పుజారా (35: 42 బంతుల్లో 7×4), అజింక్య రహానె (11: 22 బంతుల్లో 1×4) క్రీజులో కొనసాగుతున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని