Kohli: ఆ రెండు సిరీస్‌ల్లో విజయాల తర్వాత ఆసీస్‌ మమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు: విరాట్ కోహ్లీ

మరో రెండ్రోజుల్లో ఆసీస్‌, భారత్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టీమ్‌పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

Published : 05 Jun 2023 21:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు ఆస్ట్రేలియా (Australia) పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జట్లను చాలా తేలికగా తీసుకునేది. ఇతర జట్ల ఆటగాళ్లను మాటలతో కవ్విస్తూ ఆటతో అదరగొడుతూ ముప్పు తిప్పలు పెట్టేవారు. కంగారుల చేతిలో భారత్‌కు కూడా ఇలాంటి అనుభవాలే చాలాసార్లు ఎదురయ్యాయి.  కానీ, 2018-19, 2020-21లో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై భారత్‌ (Team India) ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ రెండు సిరీస్‌ల్లో విజయాల తర్వాత భారత్‌ను ఆసీస్‌ తేలిగ్గా తీసుకోవడం లేదని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. మరో రెండ్రోజుల్లో ఆసీస్‌, భారత్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

‘‘గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. చాలా ఘర్షణ వాతావరణం అనిపించేది. కానీ, మేం ఆస్ట్రేలియాలో రెండు సిరీస్‌లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్తా గౌరవంగా మారింది. ఓ టెస్టు టీమ్‌గా మమ్మల్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. మాపై ప్రత్యర్థులకు ఉన్న గౌరవాన్ని చూశాం.  వారి సొంతగడ్డపై కూడా గట్టి పోటీ ఇస్తామని వాళ్లు గుర్తించారు. మమ్మల్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై కోహ్లీ మాట్లాడాడు.‘‘ఓవల్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఓ రకమైన కండిషన్స్‌ను అంచనా వేయలేం. ఆ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. రెండు జట్లకూ ఇది ఒకే మ్యాచ్‌. అక్కడి కండిషన్స్‌కు త్వరగా అలవాటు పడిన జట్టే గెలుస్తుంది. రెండు జట్లు ఓ తటస్థ వేదికపై ఆడటం డబ్ల్యూటీసీలోని గొప్పతనం’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని