Tokyo olympics: ‘లండన్‌’ రికార్డు బ్రేక్‌.. భారత్‌ సరికొత్త పతకాల రికార్డు

టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌ గొప్ప ప్రదర్శన చేసింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలను ఒడిసి పట్టింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసింది.

Published : 07 Aug 2021 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌ గొప్ప ప్రదర్శన చేసింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం ఏడు పతకాలను ఒడిసి పట్టింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాల రికార్డును నమోదు చేసింది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు రికార్డే ఇప్పటి వరకు అత్యధికం. ఆ రికార్డును తాజాగా చెరిపేసింది. పతకాలు సాధిస్తారని ఆశించిన స్టార్లు నిరాశ పరిచినా.. కొత్త స్టార్లు ముందుకొచ్చి సరికొత్త రికార్డును అందించడం ఈసారి విశేషం.

వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం వరకు భారత్‌ సాధించిన పతకాలు ఐదే. వాటిలో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌ ఆదివారంతో ముగియనుండగా.. భారత  క్రీడాకారులు పాల్గొనే క్రీడాంశాలు శనివారంతోనే ముగిశాయి. చివరి రోజు ముగ్గురు క్రీడాకారులే పతక బరిలో నిలిచారు. దీంతో లండన్‌ రికార్డును దాటలేమా అన్న మీమాంస నెలకొంది. ఉదయం అదితి నిరాశ పరచినా.. బజరంగ్‌ పునియా కాంస్యంతో అదరగొట్టి ఆశలు చిగురింపజేశాడు. నీరజ్‌ చోప్రా ఆ కలను నిజం చేశాడు. ఇప్పటి వరకు స్వర్ణ పతకం సాధించలేదన్న సగటు భారతీయుల కలను నెరవేరుస్తూ జావెలిన్‌ త్రోలో స్వర్ణంతో మెరిశాడు. అంతేకాదు వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టాడు. అథ్లెటిక్స్‌లో వందేళ్ల చరిత్రలో తొలి పతకం సాధించి చరిత్ర లిఖించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 47వ స్థానంలో నిలవగలిగింది. ప్రస్తుతం చైనా, అమెరికా తొలి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి.

టోక్యోలో మనం.. 
టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి ఛాను సిల్వర్‌ పతకం సాధించడంతో భారత పతకాల వేట ప్రారంభమైంది. బ్యాడ్మింటన్‌లో సింధు కాంస్యంతో అలరించింది. బాక్సర్‌ లవ్లీనా కాంస్యంతో మెరిసింది. పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంస్య పతకం సాధించగా.. రెజ్లర్‌ రవికుమార్‌ దహియా రజత పతకంతో మెరిశాడు. చివరి రోజైన శనివారం భజరంగ్‌ పునియా కాంస్యంతో రాణించగా.. నీరజ్‌ చోప్రా స్వర్ణంతో సత్తా చాటాడు. దీంతో ఇప్పటి వరకు లండన్‌ (రెండు రజత, నాలుగు కాంస్య) పేరిట ఉన్న పతకాల రికార్డును భారత్‌ అధిగమించినట్లయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని