IND vs NZ: సవాళ్లను స్వీకరించడం బాగుంటుంది.. అందుకే తొలుత బ్యాటింగ్‌: హార్దిక్‌ పాండ్య

కొత్త ఏడాదిలో వరుసగా నాలుగో సిరీస్‌ను భారత్‌ (Team India) కైవసం చేసుకొంది. ఇందులో శ్రీలంక (IND vs SL), న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్లతో వన్డే, సిరీస్‌లు ఉన్నాయి. తాజాగా కివీస్‌తో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ‘మిషన్ 2024’లో భాగంగా ఘనంగా అడుగులు పడుతున్నాయి. 

Updated : 02 Feb 2023 11:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. శుభ్‌మన్ గిల్ (126*), హార్దిక్ పాండ్య (4/16) రాణించడంతో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 చరిత్రలోనే అత్యంత భారీ విజయం ఇదే కావడం విశేషం. సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు, హార్దిక్ పాండ్య ‘ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌’గా ఎంపికైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం గిల్‌, పాండ్య మాట్లాడారు. 

నేను కొంచెం తగ్గినా.. : హార్దిక్‌

‘‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డును గెలుచుకోవడం గురించి ఆలోచించలేదు. అయితే పెద్ద స్టేడియంలో అనుకొన్న విధంగా రాణించడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుతోపాటు ట్రోఫీని సొంతం చేసుకోవడంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా ఉంది. మైదానం వెలుపల వారి సహకారం ఎనలేనిది. ఇలాంటి మ్యాచ్‌ ఆడటం నాకెంతో ఇష్టం. నేను ముందస్తు ఆలోచనలు చేయను. విజయానికి ఏమి అవసరమో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. నా ఉద్దేశం ఒక్కటే.. కెప్టెన్‌గా నా ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తా. దూకుడుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటా. ఒకవేళ నేను కాస్త తగ్గితే.. నా టర్మ్స్‌ కూడా మారిపోతాయి. సవాళ్లను స్వీకరించడం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఇక్కడే  మేం ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడాం. అప్పుడు రెండో ఇన్నింగ్స్‌  కఠిన సవాల్‌ ఎదురైంది. కానీ, ఈ మ్యాచ్‌ను మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా సింపుల్‌గా ఆడాలని భావించాం. ఎందుకంటే ఇది సిరీస్‌ విజేతను నిర్ణయిస్తుంది. అందుకే తొలుత బ్యాటింగ్‌ చేశాం. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. భవిష్యత్తులో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తాం’’

పెద్ద స్కోరు సాధించాలని భావించా: గిల్‌

‘‘కష్టపడి సాధన చేసిన తర్వాత ఫలితం ఇలా వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. భారీ స్కోరు సాధించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా. శ్రీలంక సిరీస్‌లో ఇది కుదరలేదు. అయితే, ఇప్పుడు సాధించడం బాగుంది. ప్రతి ఒక్కరికి సిక్స్‌లు కొట్టేందుకు వేర్వేరు టెక్నిక్స్‌ ఉంటాయి. ‘నువ్వు ఎలా ఆడాలని భావిస్తున్నావో అలాగే ఆడేయు’ హార్దిక్‌ ఎప్పుడూ మాతో చెబుతుంటాడు. దేశం కోసం ఆడేటప్పుడు అలసట అనేదే ఉండదు. భారత్‌ కోసం ఆడాలనేది నా కల. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో ఆడటం నా అదృష్టం’’

మరికొన్ని విశేషాలు.. 

* సిరీస్‌ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్ హార్దిక్‌ యువ ఆటగాడు పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పృథ్వీ ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. 

* ఇంతకుముందు టీ20ల్లో అతిపెద్ద విజయం కూడా భారత్‌ పేరిటే ఉంది. 2018లో 143 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఇప్పుడు న్యూజిలాండ్‌పై 168 తేడాతో ఘన విజయం నమోదు చేసింది. 

* న్యూజిలాండ్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు ఇది. ఇంతకుముందు శ్రీలంక, బంగ్లాదేశ్‌ మీద 60 పరుగులే చేసింది. 

* అతిపెద్ద మైదానం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యధిక స్కోరు భారత్‌ పేరిటే నమోదైంది. గతంలో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా 224/2 స్కోరు చేయగా.. ఇప్పుడు కివీస్‌పై 234/4 సాధించింది. 

* అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా గిల్‌(126*) రికార్డు సాధించాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ (122*) పేరిట ఉన్న రికార్డును గిల్‌ అధిగమించాడు. రైనా, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లిల తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు చేసిన భారత ఆటగాడు శుభ్‌మనే.

* స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌ వరుసగా 25 సిరీసుల్లో అజేయంగా నిలిచింది. అలాగే స్వదేశంలో 50 టీ20 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా రికార్డు సృష్టించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు