Aravinda de Silva : క్రికెట్‌ వృద్ధి కోసం.. టీ20 లీగ్‌లపై భారత్‌ పట్టు సడలించాలి: లంక మాజీ క్రికెటర్‌

 భారత టీ20 లీగ్‌ సహా ఇతర టోర్నీలు క్రికెట్‌ వ్యాప్తికి చాలా ఉపయోగపడ్డాయని శ్రీలంక మాజీ కెప్టెన్‌ అరవింద డిసిల్వా తెలిపాడు. అయితే విదేశీ టోర్నమెంట్లలో...

Published : 06 Jul 2022 13:52 IST

(ఫొటో సోర్స్‌: లంక క్రికెట్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టీ20 లీగ్‌ సహా ఇతర టోర్నీలు క్రికెట్‌ వ్యాప్తికి చాలా ఉపయోగపడ్డాయని శ్రీలంక మాజీ కెప్టెన్‌ అరవింద డిసిల్వా తెలిపాడు. అయితే విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి భారత స్టార్‌ ఆటగాళ్లకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశాడు. జోస్‌ బట్లర్, డేవిడ్‌ వార్నర్ వంటి విదేశీ క్రికెటర్ల టాలెంట్‌ ప్రపంచానికి తెలిసేలా చేయడంలో భారత టీ20 లీగ్‌ కీలక పాత్ర పోషించిందని, అదేవిధంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లనూ ఇతర దేశాల్లో లీగ్‌లు ఆడేందుకు అనుమతిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో కౌంటీలకు ఆడినప్పుడు ఇంగ్లాండ్‌ క్రికెట్‌కు చాలా ప్రయోజనం చేకూరేదని డిసిల్వా పేర్కొన్నాడు. 

ఇటీవల భారత టీ20 లీగ్ మీడియా హక్కుల కోసం జరిగిన బిడ్‌లో భారీ మొత్తం వెచ్చించి మరీ సంస్థలు కొనుగోలు చేశాయి. దాదాపు 6.2 బిలియన్‌ డాలర్లను వెచ్చించాయి. ఒక్కో మ్యాచ్‌కు దాదాపు 15 మిలియన్‌ డాలర్లను బీసీసీఐ దక్కించుకుంది. సంపద సృష్టిస్తున్న ఇటువంటి లీగ్‌లో చిన్న దేశాలకూ భాగస్వామ్యం కల్పించాలని అరవింద డిసిల్వా సూచించాడు. అప్పుడే ఆ దేశాల్లో  మెరుగైన క్రికెట్‌ నైపుణ్యాలు వెలికి తీసే అవకాశం ఉంటుందని విశ్లేషించాడు.

‘‘క్రికెట్‌లో డామినేటింగ్‌ దేశం (భారత్) టీ20 లీగ్‌లలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే.. తమ దేశ క్రికెటర్లను విదేశీ టోర్నీల్లో ఆడించడానికి అనుమతించడం లేదు. దీని వల్ల ప్రమాణాలు పడిపోతూ ఉంటే ఏదొక సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే క్రికెట్ వృద్ధి కోసం టీ20 లీగ్‌లపై భారత్‌ పట్టు సడలించాలి. చిన్న దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ చర్యలు తీసుకోవాలి. లేకపోతే జింబాబ్వే, దక్షిణాఫ్రికా మాదిరిగా మా జట్టులో కూడా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది’’ అని అరవింద డిసిల్వా ఆందోళన వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని