Wasim Jaffer: సూర్యకుమార్‌కు బదులు సంజూ శాంసన్‌ని తీసుకోండి: వసీం జాఫర్‌

సూర్యకుమార్‌ యాదవ్‌  (Suryakumar Yadav) వన్డేల్లో కొంతకాలంగా విఫలమవుతున్నాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ని తీసుకోవాలని టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ వసీం జాఫర్ సూచించాడు. 

Published : 24 Mar 2023 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్: లేటు వయసులో టీమ్‌ఇండియాలోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) టీ20ల్లో తక్కువ కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఎదిగాడు. అయితే, ఈ బ్యాటర్‌ వన్డేల్లో ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు 21 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.05 సగటుతో 433 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు బదులుగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ని వన్డే టీమ్‌లోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ (Wasim Jaffer) అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్‌ ఇప్పటివరకు 11 వన్డే మ్యాచ్‌లు ఆడి 66 సగటుతో 330 పరుగులు చేశాడు. 

‘సూర్యకుమార్‌ యాదవ్‌పై నాకు సానుభూతి ఉంది. బహుశా 11వ స్థానంలో వచ్చే బ్యాటర్‌కు కూడా ఇలా (వరుసగా మూడుసార్లు గోల్డెన్‌ డక్‌) జరిగి ఉండదు. సూర్య కెరీర్‌లో మళ్లీ ఇలా జరగకూడదని ఆశిస్తున్నా. ఇది అతడి దురదృష్టం. అయితే, వన్డేల్లో సూర్య స్థానంలో సంజూ శాంసన్‌ని లేదా 
మరో బ్యాటర్‌ని తీసుకోవాల్సిన అవసరముంది. సూర్యకుమార్‌ నాణ్యమైన ఆటగాడే.  అతడు ఐపీఎల్‌లో రాణిస్తాడనే నమ్మకముంది. ఐపీఎల్‌లో బాగా ఆడితే అతడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. కానీ, సంజూ శాంసన్‌పై కూడా భారత్ దృష్టి పెట్టాలి’’ అని జాఫర్ అన్నాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్‌-16 సీజన్‌ ప్రారంభం కానుంది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబయి ఇండియన్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక ఆటగాడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని