Asia Cup : అఫ్గాన్‌ గెలవాలి.. టీమ్‌ఇండియా ఆశలు నిలవాలి!

టీమ్‌ఇండియా క్రికెట్‌ అభిమానుల నోట ఓ రెండు జట్ల పేర్లు మారుమోగడం ఖాయం. అందులో ఒకటి అఫ్గానిస్థాన్‌.. మరొకటి పాకిస్థాన్‌..  ఎందుకంటారా..? ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌ వెళ్లాలంటే...

Published : 07 Sep 2022 17:30 IST

ఆసియా కప్‌ సూపర్‌-4లో ఇవాళ పాక్‌తో అఫ్గాన్‌ మ్యాచ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెట్‌ అభిమానుల నోట ఓ రెండు జట్ల పేర్లు మారుమోగడం ఖాయం. అందులో ఒకటి అఫ్గానిస్థాన్‌.. మరొకటి పాకిస్థాన్‌..  ఎందుకంటారా..? ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌ వెళ్లాలంటే ఈ టీమ్‌లు ఆడే మ్యాచ్‌లు చాలా కీలకం. ఇవాళ పాకిస్థాన్‌తో అఫ్గాన్‌ తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అలాకాకుండా అఫ్గాన్‌ గెలిస్తే భారత్‌కు అవకాశాలు సజీవంగా ఉంటాయి. అప్పుడు గురువారం అఫ్గాన్‌ మీద టీమ్‌ఇండియా విజయం సాధిస్తే రేసులో నిలుస్తుంది. ఇక పాకిస్థాన్‌ కూడా తన చివరి మ్యాచ్‌లో లంకపైనా ఓడాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. మిగిలిన జట్లు ఇంటిముఖం పడతాయి. 

ఇరు జట్లు పోటాపోటీగానే.. 

ఇవాళ పాక్‌, అఫ్గాన్‌ మ్యాచ్‌ ఫలితంపై భారత్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.  టీ20 క్రికెట్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఒకే ఒక ఓవర్‌లో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. అలాంటి ఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్‌ జట్టు ఉత్తమ ప్రదర్శనే ఇస్తోంది. ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సూపర్‌-4కి చేరుకుంది. అయితే లంకపై చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో పాక్‌తో సమరానికి సిద్ధమైంది. అఫ్గాన్‌ టీమ్‌లో జజాయ్, గుర్బాజ్‌, ఇబ్రహీం జాద్రాన్, నబీ, రషీద్‌ ఖాన్‌, నజీబుల్లా, ముజీబ్‌ వంటి టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అఫ్గాన్‌తో పోలిస్తే పాక్‌ జట్టే బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. బాబర్ అజామ్‌, రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, నవాజ్‌, ఫకర్ జమాన్‌ వంటి బ్యాటర్లు ఆ జట్లు సొంతం. నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌, నవాజ్‌ బౌలింగ్‌లో మెరుస్తున్నారు.

అఫ్గాన్‌ మీద మనం గెలిస్తేనే.. 

ఒక వేళ ఇవాళ అఫ్గాన్‌ మీద పాక్‌ ఓడితే మాత్రం భారత్‌కు ఛాన్స్‌ దక్కినట్లే. దానిని సద్వినియోగం చేసుకోవాలంటే అఫ్గాన్‌ మీద టీమ్‌ఇండియా భారీ విజయం సాధించాలి. అయితే ఎప్పుడైనా సరే టాస్ కీలకంగా మారుతుంది.  కాబట్టి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ నెగ్గితేనే భారీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ పెరుగుతుంది. శ్రీలంకపైనా పాక్‌ ఓడితే నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇది జరగాలంటే భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే కనీసం 200కిపైగా పరుగులు సాధించాలి. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అయితే కేఎల్ రాహుల్‌, రిషభ్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, దీపక్ హుడా కీలక సమయంలో ఔటై నిరాశపరిచారు. ఇక బౌలింగ్‌లోనూ కట్టడి చేయాలి. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నా.. దానిని కొనసాగించడంలో విఫలం కావడంతో ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులను సంధించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని