Gautam Gambhir - Ashwin: గంభీర్‌ గొప్ప ఫైటర్.. అతడిని తప్పుగా అర్థం చేసుకొన్నారు: అశ్విన్

ప్రపంచ క్రికెట్‌లో గౌతమ్ గంభీర్‌ను అత్యంత తప్పుగా అర్థం చేసుకొన్నట్లు టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 22 Jun 2024 14:26 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌ (Team India Head Coach)గా గౌతమ్‌ గంభీర్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ అతడిని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) గంభీర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని పోరాటయోధుడిగా అభివర్ణించాడు. అదే సమయంలో గంభీర్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించాడు. గంభీర్‌తో కలిసి తొలినాళ్లలో ఆడిన రోజులను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. 

‘‘న్యూజిలాండ్‌తో 2012లో తొలిసారి నేను పూర్తిస్థాయి టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యా. అంతకుముందు 2011 వరల్డ్‌కప్ ముందు రెండేళ్లపాటు కేవలం డ్రింక్స్‌ను మాత్రమే అందించా. కెరీర్‌ ఆరంభంలో నా ఆత్మవిశ్వాసం పెరగడంలో గంభీర్‌ (Gautam Gambhir) కీలక పాత్ర పోషించాడు. తమిళనాడు నుంచి వచ్చినవారెవరూ కూడా అతడిలా నమ్మకం కలిగించలేదు. అతడి ప్రవర్తనను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. గేమ్‌పై అతడికున్న అవగాహన అత్యుత్తమమైంది. గంభీర్‌ గొప్ప ఫైటర్. అయితే, మనకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఎవరినైనా ఒక్కసారి హీరోగా చూశామా.. మిగతావారిని పట్టించుకోం. ఇదేమీ సినిమా కాదు. క్రికెట్‌లో ఆటుపోట్లు ఎక్కువ. ఇక్కడ ఎవరూ హీరోలు, విలన్లు ఉండరు. గంభీర్‌ విజయం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి. అతడిపై నాకు అపారమైన గౌరవం ఉంది’’ అని అశ్విన్‌ (Ashwin) వ్యాఖ్యానించాడు. 

గంభీర్‌ ఇలా.. 

ఒకవైపు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ వస్తాడని ప్రచారం జరుగుతుంటే.. తాజాగా ఈ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేశాయి. ‘‘ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదు. మీరు నన్ను కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడే దీని (కోచ్‌ పదవి)పై సమాధానం చెప్పడం కష్టం. ఇటీవలే అద్భుతమైన ప్రయాణాన్ని ముగించుకొని ఇప్పుడు ఆనందంగా ఉన్నా’’ అని తెలిపాడు. ఈనెలాఖరులోగా కోచ్‌ ఎవరనేది బీసీసీఐ (BCCI) ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌ (ICC Mens T20 World Cup) జరుగుతోంది. అప్పటివరకే రాహుల్‌ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని