Bumrah: బుమ్రాను మరిచిపోండి.. ఉమేశ్‌ను తీసుకోండి: మాజీ క్రికెటర్‌

స్టార్‌ పేసర్ బుమ్రాకు (Bumrah) అయిన గాయం చిన్నదేమీ కాదని.. కోలుకొని వచ్చేందుకు అతడికి ఇంకా మరింత సమయం ఇవ్వాలని టీమ్‌ఇండియా (Team India) మాజీ ఆటగాడు కీలక సూచనలు చేశాడు. 

Published : 05 Mar 2023 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (Bumrah) ఇప్పటికే దాదాపు ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో గత సెప్టెంబర్ నుంచి బంతిని పట్టుకోలేదు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కైనా వస్తాడని భావించినా.. సాధ్యపడలేదు. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లోనూ (IPL 2023) ఆడటం కష్టమేనని తెలుస్తోంది. ఐపీఎల్‌ ముగిశాక జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఉంది. ఆ తర్వాత ఆసియా కప్‌.. వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలు ఉండటంతో బుమ్రాపై ఒత్తిడి పెంచేందుకు బీసీసీఐ ఆసక్తిగా లేదు. కనీసం మూడు నెలల సమయం ఉండటంతో బుమ్రా కోలుకుని వస్తాడని టీమ్‌ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అయితే, ఒకవేళ టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తే బుమ్రాను పరిగణనలోకి తీసుకోకుండా, ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేసుకోవాలని మాజీ క్రికెటర్‌ మదనల్‌లాల్‌ సూచించాడు. ఇప్పుడు ఉమేశ్‌ ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు

‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ వెళ్తే.. ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకెళ్లాలి. లండన్‌లో కాబట్టి, కనీసం ముగ్గురు పేసర్లు అవసరం. బుమ్రాను పూర్తిగా మరిచిపోవాలి. మీ సమీకరణాల్లో నుంచి అతడిని తీసేయాలి. బుమ్రా వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అప్పటి వరకు మన దగ్గర ఉన్నవారిని చక్కగా వినియోగించుకోవాలి. బుమ్రా వచ్చేందుకు ఏడాదిన్నర అయినా పట్టే అవకాశం ఉంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముందే వస్తాడని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా..? ఎందుకంటే అతడి గాయం అంత తీవ్రమైందని నేను భావిస్తున్నా. చిన్నపాటి గాయమైతేనే తగ్గేందుకు కనీసం మూడు నెలలు సమయం పడుతుంది. ఇప్పుడు అతడు గత ఆరు నెలల నుంచి క్రికెట్‌ ఆడటం లేదు. గతంలో హార్దిక్‌ పాండ్య కూడా నాలుగు నెలల్లోనే వచ్చాడు. కానీ, బుమ్రా మాత్రం 6 నెలలైనా మైదానంలోకి అడుగు పెట్టలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో గత బుమ్రా ప్రదర్శనను అతడి నుంచి వస్తుందని ఎలా ఆశించగలం? అందుకే, మంచి ఫామ్‌లో ఉన్న బుమ్రాను చూడాలంటే మరింత సమయం ఇవ్వాలి’’ అని మదన్‌లాల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని