Bumrah - Shami: బుమ్రా మాదిరిగా షమీ ప్రొఫెషనల్‌ కాదు.. టెస్టుల్లోకి వచ్చేందుకు కష్టపడాలి: డీకే

టీ20 ప్రపంచకప్ నుంచి బుమ్రా జట్టుతో లేడు. షమీ కూడా పొట్టి కప్‌ తర్వాత దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు వీరిద్దరూ లేరు. గాయాల నుంచి కోలుకున్నప్పటికీ శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. 

Published : 28 Dec 2022 00:32 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో సీనియర్ ఫాస్ట్‌ బౌలర్లు మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బంగ్లాతో టెస్టు సిరీస్‌ ముగిసింది. గాయాల కారణంగా వీరిద్దరూ బంగ్లా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు బుమ్రా వెన్నెముక గాయంతో బాధపడ్డాడు.  అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. మరోవైపు, మహమ్మద్‌ షమీ భుజానికి గాయంతో ఆడలేకపోయాడు. ఈ క్రమంలో వీరిద్దరూ తిరిగి జట్టులోకి ఎప్పుడొస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై దినేష్‌ కార్తిక్‌ స్పందించాడు. 

ఓ క్రీడా ఛానెల్‌తో డీకే మాట్లాడుతూ.. షమీ కంటే ముందుగా బుమ్రా జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ‘‘షమీ, బుమ్రా ఇద్దరూ సీనియర్ ఫాస్ట్‌ బౌలర్లు. గాయం నుంచి బుమ్రా త్వరగా కోలుకొని తిరిగొస్తాడనే నమ్మకం ఉంది. ఎందుకంటే అతడు ప్రొఫెషనల్ ప్లేయర్‌. తుపాకీలో తూటాలా తిరిగొస్తాడు. టెస్టు కంటే ముందు బుమ్రా కొన్ని వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అప్పుడే అతడి శరీరం పని ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది’’

‘‘షమీ గురించి కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అతడు బుమ్రా వలె ప్రొఫెషనల్‌ కాదు. షమీ కొంత కాలంగా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఏదో ఒక కారణంతో కొంతకాలంగా భారత ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారు. భారత జట్టు, ఎన్‌సీఏ తమను తాము సర్దుబాటు చేసుకోవాలి. కొంతకాలం పాటు ఫిట్‌గా ఉండేలా ఆటగాళ్లు ప్రణాళిక చేయాలి. ఎందుకంటే వారు ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది’’ అని దినేశ్‌ కార్తిక్‌ వెల్లడించాడు. శ్రీలంకతో భారత్‌ మూడు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని