Ban vs Ind: మూడో వన్డేలో గెలవడం టీమ్ఇండియాకు చాలా ముఖ్యం: గావస్కర్‌

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ని చేజార్చుకుంది. డిసెంబర్‌ 10న నామమాత్రపు మూడో వన్డే జరగనుంది.

Updated : 08 Dec 2022 19:37 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి  సిరీస్‌ని చేజార్చుకుంది. డిసెంబర్‌ 10న నామమాత్రపు మూడో వన్డే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ టెస్టు సిరీస్‌కు ముందు జరిగే మూడో వన్డేలో గెలవడం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యమని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.  ‘వారు (టీమ్‌ఇండియా) తమ బలమైన జట్టును ఎంచుకోవాలి. త్వరలో జరిగే టెస్టు సిరీస్‌కు  ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడానికి ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలి. టెస్టులు, వన్డేలకు జట్టు కూర్పు కాస్త భిన్నంగా ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో బంగ్లాదేశ్ పటిష్టంగా ఉంది. మూడో వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్‌ ఓటమి తేడాను  2-1కి తగ్గించాలి. ఈ వన్డేలో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని తర్వాత జరిగే టెస్ట్‌ సిరీస్‌లో గెలుపొందడానికి ప్రయత్నించండి’ అని గావస్కర్  సూచించారు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే బోర్డర్‌, గావస్కర్‌ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో విజయం సాధించడం కీలకమని పేర్కొన్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో అవకాశం దక్కాలంటే భారత్‌ తన మిగిలిన 6 టెస్టుల్లో ఐదు తప్పక గెలవాలి. ‘బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను గెలిస్తే భారత్‌కు లాభదాయకంగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా నాలుగు టెస్టులు ఆడనుంది. బంగ్లాతో ఈ రెండు టెస్టులు గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు దోహదపడతాయి’ అని సునీల్ గావస్కర్‌ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని