IND vs PAK: పాక్‌కు వెళ్లేది లేదు.. ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటున్న బీసీసీఐ!

పాకిస్థాన్‌లో భారత్‌ జట్టు పర్యటించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించడం లేదు. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని.. మ్యాచ్‌ వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తోంది.

Updated : 11 Jul 2024 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్‌ ట్రోఫీకి (Champions Trophy) పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటికే పాక్‌ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. అయితే, ఈ షెడ్యూల్‌కు బీసీసీఐ ఆమోదం తెలపలేదని తెలుస్తోంది. తాజాగా మరో విషయం బయటకొచ్చింది. గత ఆసియా కప్‌ జరిగినట్లే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనలను ఐసీసీ ఎదుట బీసీసీఐ (BCCI) ఉంచినట్లు సమాచారం. భారత్‌ మ్యాచ్‌లను వేరే ప్రాంతానికి తరలించి.. మిగతా వాటిని పాక్‌ వేదికగానే నిర్వహించుకొనే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేది లేదని.. భారత్‌ ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాల్సిందేనని బీసీసీఐ పట్టుబట్టినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

ఇప్పటికే టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్‌ను పాక్‌ సిద్ధం చేసింది. భారత్‌ ఆడే మ్యాచ్‌లకు ముసాయిదా షెడ్యూల్‌లో పాక్‌ లాహోర్‌ స్టేడియాన్ని కేటాయించింది. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ అక్కడే జరుగుతాయని పేర్కొంది. అయితే, భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో అసలు పాక్‌కే వెళ్లకూడదనే కృతనిశ్చయంతో బీసీసీఐ ఉంది. దీంతో భారత్ ఆడే వేదికలను శ్రీలంక లేదా దుబాయ్‌కు మార్చాలనే కండీషన్‌ను పెట్టింది. ఎనిమిది జట్లతో కూడిన ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. 

‘‘ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత్ అక్కడికి పర్యటించడం కష్టమే. తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు హైబ్రిడ్‌ మోడల్‌ను అమలుచేసే అవకాశం ఉంది. శ్రీలంక లేదా దుబాయ్‌లో భారత్ తన  మ్యాచ్‌లు ఆడుతుంది. ఐసీసీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. అయితే, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చివరిసారిగా ధోనీ నాయకత్వంలో భారత్ 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకొంది. ఇప్పుడు మరోసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ను అందించిన హిట్‌మ్యాన్‌ ఈ ట్రోఫీని కూడా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని