Side Shows: టిమ్‌ పైన్‌ వితండ వాదం!

ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్‌పైన్‌ వింత భాష్యానికి దిగాడు! టీమ్‌ఇండియా దృష్టి మళ్లించడంతోనే తాము టెస్టు సిరీసులో...

Updated : 13 May 2021 13:52 IST

పక్కదారిపట్టించి భారత్‌ గెలిచిందట..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్‌పైన్‌ వింత భాష్యానికి దిగాడు! టీమ్‌ఇండియా దృష్టి మళ్లించడంతోనే తాము టెస్టు సిరీసులో ఓడిపోయామని అంటున్నాడు. పక్కదారి పట్టించడంలో భారత్‌ విజయవంతమైందని పేర్కొంటున్నాడు.

ఆసీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చివరి పర్యటనలో 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచింది. అడిలైడ్‌ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన కోహ్లీసేన ఆ తర్వాత విజయ దుందుభి మోగించింది. విరాట్‌ కోహ్లీ లేకున్నా.. సీనియర్‌ పేసర్లు గాయపడ్డా.. అనుభవం లేని ఆటగాళ్లే బౌలింగ్‌ చేసినా పైన్‌ బృందాన్ని చిత్తు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కీలకంగా ఆడారు.

సాధారణంగా ఆసీస్‌లో పర్యటించే జట్టు ఏకాగ్రతను పక్కదారి పట్టించడంలో కంగారూలను మించిన వారే లేరు. స్లెడ్జింగ్‌ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యాటక జట్లు ఓడిపోవడం ఖాయమేనంటూ మైండ్‌ గేమ్‌కు తెరతీయడం,  స్థానిక మీడియా సైతం అందుకు తగ్గట్టే కథనాలు ప్రచురించడం చేస్తుంటాయి. కానీ, ఇప్పుడు టీమ్‌ఇండియా 2-1తో గెలవడంతో పైన్‌ వింత భాష్యాలు చెబుతున్నాడు. అప్పుడేమో తాను అతిగా మాట్లాడానని పశ్చాత్తాపం చెందాడు.

‘పక్కదారి పట్టించడం (Side Shows)లో టీమ్‌ఇండియా బాగుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొడుతుంది. సిరీస్‌లో అలాంటి వాటికి మేం పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీనిని ఎదుర్కోవడం సవాలే. ఇందుకో ఉదాహరణ చెబుతా. వాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్‌ ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల సృష్టిలో వారు బాగున్నారు. దాంతో మేం బంతిపై దృష్టి పెట్టలేకపోయాం’ అని పైన్‌ అన్నాడు. నిజానికి ఆ సమయంలో ఆసీస్‌లో కరోనా ఆంక్షలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని