KL Rahul : గొప్ప మనసు చాటుకున్న కేఎల్ రాహుల్‌.. బాలుడి శస్త్ర చికిత్స కోసం ఆర్థిక సాయం.!

టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ బాలుడి శస్త్ర చికిత్స కోసం సాయం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల వరద్ నల్వాడే అనే బాలుడు అరుదైన..

Published : 23 Feb 2022 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ బాలుడి శస్త్ర చికిత్స కోసం సాయం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల వరద్ నల్వాడే అనే బాలుడు అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గతేడాది సెప్టెంబరు నుంచి ముంబయిలోని జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వరద్ తల్లిదండ్రులు ఎముకలోని మజ్జా మార్పిడి (బోన్‌ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌)కి శస్త్ర చికిత్స చేయించే ఖర్చులను భరించే స్థోమత లేకపోవడంతో.. ‘గివ్‌ ఇండియా’అనే స్వచ్చంద సంస్థను సాయం కోరారు. వరద్ తండ్రి సచిన్ నల్వాడే ఇన్సూరెన్స్‌ ఏజెంట్ కాగా, తల్లి స్వప్న నల్వాడే గృహిణి. గివ్‌ ఇండియా ద్వారా విషయం తెలుసుకున్న కేఎల్‌ రాహుల్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శస్త్ర చికిత్సకు అవసరమైన రూ.31 లక్షలు విరాళంగా అందజేశాడు. 

(Photo : Give India Twitter)

‘వరద్‌ పరిస్థితి గురించి తెలిసిన వెంటనే.. నా టీమ్‌ గివ్ ఇండియాను సంప్రదించింది. చికిత్సకు అవసరమైన సాయం అందజేస్తామని చెప్పాం. ప్రస్తుతం శస్త్ర చికిత్స విజయవంతమై అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే వరద్‌ పూర్తిగా కోలుకుని.. తన కలలను సాకారం చేసుకుంటాడనుకుంటున్నాను. నేను చేసిన ఈ చిరుసాయం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మరికొంత మంది ముందుకొస్తారనుకుంటున్నాను’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.

‘నా కుమారుడి శస్త్ర చికిత్స కోసం సాయమందించిన కేఎల్ రాహుల్‌కి ధన్యవాదాలు. రాహుల్ ముందుకు రాకపోయుంటే ఇంత తక్కువ సమయంలో ఈ శస్త్ర చికిత్స సాధ్యమయ్యేది కాదు’ అని వరద్ తల్లి స్వప్న నల్వాడే చెప్పారు. ‘కేఎల్ రాహుల్ ఉదారతకు ధన్యవాదాలు. తన దాతృత్వంతో వరద్‌కి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. రాహుల్ లాంటి ఒక గొప్ప క్రికెటర్‌ ముందుకు వచ్చి సాయం చేయడం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుంది. దీంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు మరికొంత మంది ముందుకొస్తారనుకుంటున్నాను’ అని గివ్ ఇండియా సీవోవో సుమిత్ తయాల్ అన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని