INDw Vs SAw: పూజ.. అద్భుతం చేసింది

4 బంతుల్లో 6 పరుగులు. పరుగుల వరద పారిన రెండో వన్డేలో గెలవడానికి దక్షిణాఫ్రికా మహిళల సమీకరణమిది. 326 పరుగుల ప్రపంచ రికార్డు ఛేదనలో ఆ జట్టు ప్రదర్శించిన జోరు చూస్తే కచ్చితంగా గెలిచేలా కనిపించింది.

Updated : 20 Jun 2024 02:40 IST

రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం 
స్మృతి, హర్మన్‌ శతకాలు

4 బంతుల్లో 6 పరుగులు. పరుగుల వరద పారిన రెండో వన్డేలో గెలవడానికి దక్షిణాఫ్రికా మహిళల సమీకరణమిది. 326 పరుగుల ప్రపంచ రికార్డు ఛేదనలో ఆ జట్టు ప్రదర్శించిన జోరు చూస్తే కచ్చితంగా గెలిచేలా కనిపించింది. కానీ పూజ వస్త్రాకర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించింది. అద్భుత శతకంతో దక్షిణాఫ్రికాను గెలిపించినంత పనిచేసిన వోల్వార్ట్‌ నిస్సహాయంగా మిగిలిపోయింది. స్మృతి, హర్మన్‌ప్రీత్‌ భారీ శతకాలతో భారత్‌ భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు శతకాలు నమోదు కావడం విశేషం. 

బెంగళూరు: భారత మహిళల జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. బుధవారం రెండో వన్డేలో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. స్మృతి మంధాన (136; 120 బంతుల్లో 18×4, 2×6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (103 నాటౌట్‌; 88 బంతుల్లో 9×4, 3×6) శతకాలు బాదడంతో మొదట భారత్‌ 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్మృతికి సిరీస్‌లో ఇది వరుసగా రెండో శతకం. 16 ఓవర్లకు వికెట్‌ నష్టానికి కేవలం 48 పరుగులే చేసిన భారత్‌ ఆ తర్వాత చెలరేగిపోయింది. స్మృతి, హర్మన్‌ప్రీత్‌ మూడో వికెట్‌కు 171 పరుగులు జోడించారు. ఆ తర్వాత రిచా ఘోష్‌ (25 నాటౌట్‌)తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్‌ 54 పరుగులు జోడించింది. ఆఖరి 10 ఓవర్లలో భారత్‌ 118 పరుగులు రాబట్టింది. ఛేదనలో వోల్వార్ట్‌ (135 నాటౌట్‌; 135 బంతుల్లో 12×4, 3×6), మరిజేన్‌ కాప్‌ (114; 94 బంతుల్లో 11×4, 3×6) అద్భుతంగా పోరాడినా.. దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 6 వికెట్లకు 321 పరుగులే చేసింది. పూజ వస్త్రాకర్‌ (2/54) దీప్తి శర్మ (2/56) బంతితో రాణించారు. ఛేదనలో 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను వోల్వార్ట్, కాప్‌ ఆదుకున్నారు. ధాటైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును నడిపించారు. నాలుగో వికెట్‌కు 184 పరుగులు జోడించాక కాప్‌ ఔటైనా.. డిక్లెర్క్‌ (28)తో కలిసి వోల్వార్ట్‌ జట్టును విజయం దిశగా నడిపించింది. ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సివుండగా దక్షిణాఫ్రికాను ఆపడం భారత్‌కు కష్టమే అనిపించింది. కానీ వస్త్రాకర్‌ గొప్పగా బౌలింగ్‌ చేసి బ్యాటర్లను కట్టిపడేసింది. తొలి రెండు బంతుల్లో వరుసగా 1, 4 ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత డిక్లెర్క్, షాంగేస్‌లను ఔట్‌ చేసింది. అయిదో బంతికి సింగిల్‌ ఇచ్చింది. ఆఖరి బంతికి సిక్స్‌ అవసరం కాగా.. వోల్వార్ట్‌ సింగిల్‌ కూడా తీయలేకపోయింది.

భారత్‌: 325/3 (స్మృతి 136, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 103 నాటౌట్, రిచా ఘోష్‌ 25 నాటౌట్, షెఫాలి వర్మ 20; ఎంలబా 2/51);

దక్షిణాఫ్రికా: 321/6 (వోల్వార్ట్‌ 135 నాటౌట్, మరిజేన్‌ కాప్‌ 114, డిక్లెర్క్‌ 28; పూజ వస్త్రాకర్‌ 2/54, దీప్తి శర్మ 2/56)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని