IndW vs PakW: మహిళల టీ20 ప్రపంచకప్‌.. పాక్‌పై టీమ్‌ఇండియా ఘనవిజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌ (ICC Women's T20 World Cup) లో పాకిస్థాన్‌పై భారత్‌ (India Women vs Pakistan Women) ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించింది.

Updated : 12 Feb 2023 22:21 IST

కేప్‌టౌన్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటింగ్‌లో జెమీమీ రోడ్రిగ్స్‌ (53*) హాఫ్‌ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మ (33), రీచా ఘోష్‌ (31*) కూడా రాణించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (16), యాస్తికా భాటియా(17) రాణించలేకపోయారు. పాక్‌ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు, సదియా ఇక్బాల్‌ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.


విజయానికి 47 పరుగుల దూరంలో..

కేప్‌టౌన్‌: పాక్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి ఇంకా 47 పరుగుల దూరంలో ఉంది. 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. నష్రా సంధు వేసిన 13.3వ బంతికి భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ (16) పరుగుల వద్ద మరూఫ్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్‌ (33*) ఆచితూచి ఆడుతుండగా.. ఆమెతో పాటు రీచా ఘోష్‌ (3*) క్రీజులో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో ఇక్బాల్‌, నష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు. టీమ్‌ఇండియా విజయానికి ఇంకా 30 బంతుల్లో 47 పరుగులు చేయాల్సి ఉంది.


ఇంకాస్త దూకుడు పెంచాలి..

కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ శుభారంభం చేయాలంటే.. ఇంకాస్త స్పీడ్‌ పెంచాలి. వికెట్‌ నష్టానికి 43 పరుగులతో పవర్‌ ప్లేను ముగించిన భారత్‌.. 9.1 ఓవర్లకు 65/2 దగ్గర నిలిచింది. క్రీజులో జెమీమా రోడ్రిగ్స్‌ (14*) ఉన్నారు. యాస్తికా భాటియా (17)ను సాదియా ఇక్బాల్‌ ఔట్‌ చేయగా, షెఫాలీ వర్మ (33)ను నష్రా సంధు ఔట్‌ చేసింది. భారత్‌ విజయానికి ఇంకా 65 బంతుల్లో 85 పరుగులు చేయాలి.


నిలకడగా భారత్‌ ఇన్నింగ్స్‌

పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ మహిళలు నిలకడగా ఆడుతున్నారు. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేశారు. యాస్తికా భాటియా (17*), షెఫాలీ వర్మ (15*) క్రీజులో ఉన్నారు.


భారత్‌ లక్ష్యం 150

బిస్మా మరూఫ్‌, అయేషా నసీమ్‌ రాణించిన వేళ భారత్‌ ముందు పాకిస్థాన్‌ ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్‌ 149 పరుగులు చేసింది. ఒకానొక దశలో 74కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించిన పాక్‌ను బిస్మా (68*), అయేషా (43*) ఆదుకున్నారు. గతి తప్పిన బంతి వస్తే బౌండరీలు.. జాగ్రత్తగా వేస్తే సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. పాక్‌ బ్యాటర్లలో జవేరియా ఖాన్‌ (8), నిదా దర్‌ (0), సిద్రా అమీన్‌ (11), మునీబా అలీ (12) నిరాశపరిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 2.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 


బిస్మా అర్ధ శతకం

నెమ్మదిగా సాగుతున్న పాకిస్థాన్‌ స్కోరు బోర్డును అయేషా నసీమ్‌ (18 బంతుల్లో 33 నాటౌట్‌) పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు నిలకడగా ఆడుతూ చ్చిన బిస్మా (50*) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. నాలుగు వికెట్లు తీసి జోరు మీద కనిపించిన భారత బౌలర్లను అయేషా వరుస బౌండరీలతో ఇబ్బందిపెడుతోంది. 17.1 ఓవర్లకు పాక్‌ స్కోరు 120/4. 


పరుగులు ఇవ్వకుండా

పవర్‌ ప్లేలో (తొలి ఆరు ఓవర్లలో) 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీసిన భారత్‌.. ఆ తర్వాత జోరు పెంచింది. 13 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు పడగొట్టింది. దాంతోపాటు పరుగుల విషయంలో పిసినారిగా వ్యవహరిస్తోంది. దీంతో 74 పరుగులకే పాక్‌ పరిమితమైంది. ప్రస్తుతం క్రీజులో క్రీజులో బిస్మా (37*), అయేషా నసీమ్‌ (4*) ఉన్నారు. 


వరుసగా రెండు వికెట్లు

పాకిస్థాన్‌తో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ పట్టబిగిస్తోంది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి.. పాక్‌కు షాకిచ్చింది. ఏడో ఓవర్‌లో జవేరియాను ఔట్‌ చేయగా.. ఎనిమిదో ఓవర్‌లో నిదా దర్‌ డకౌట్‌ అయ్యింది. పూజా వస్త్రాకర్‌కు ఈ వికెట్‌ దక్కింది.  8 ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్థాన్‌ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. క్రీజులో బిస్మా (24*), సిద్రా అమీన్‌ (1*) ఉన్నారు. 


నిలకడగా ఇన్నింగ్స్‌

భారత్‌తో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిలకడగా ఆడుతోంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లిద్దరూ పెవిలియన్‌కు చేరారు. మునీబా అలీని (12)ని రాధా యాదవ్‌ ఔట్‌ చేయగా, జవేరియా ఖాన్‌ (8)ను దీప్తి శర్మ పెవిలియన్‌కు పంపించింది. దీంతో ఏడు ఓవర్లకు పాక్‌ 42/2గా ఉంది. క్రీజులో బిస్మా మరూఫ్‌ (22*), నిదా దర్‌ (0*) ఉన్నారు. 


టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌

కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌(Womens T20 World Cup-2023)లో రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌-బి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా (INDW vs PAKW) తలపడనుంది. కేప్‌టౌన్‌ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

భారత జట్టు: షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, రోడ్రిగస్‌, హర్లీన్‌, హర్మన్‌ప్రీత్‌కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌.

పాక్‌ జట్టు: జవేరియా ఖాన్‌, మునీబా అలీ, బిస్మా మరుఫ్‌ (కెప్టెన్‌), నిదా దర్‌, సిద్రా అమీన్‌, అలీయా రియాజ్‌, అయేషా నసీమ్‌, ఫాతిమా సనా, ఐమన్‌ అన్వర్‌, నశ్రు సంధు, సదియా ఇక్బాల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని