Cheteshwar Pujara: నా కెరీర్‌లో అత్యుత్తమ సిరీస్‌ అదే: ఛెతేశ్వర్ పుజారా

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తన కెరీర్‌లో ఎన్నో అపురూపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలనందించాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న బోర్డర్ గావస్కర్‌ ట్రోఫీకి అతడు సిద్ధమవుతున్నాడు.

Published : 06 Feb 2023 01:23 IST

ఇంటర్నెట్ డెస్క్:  2018-19 ఆస్ట్రేలియా పర్యటన (బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ) తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన, అత్యుత్తమ సిరీస్ అని భారత టాప్‌ ఆర్డర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. భారత టాప్‌ ఆర్డర్‌లో కీలక బ్యాటర్‌గా ఉన్న పుజారా ఆస్ట్రేలియాలో జరిగిన 2018-19 మధ్య జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. మొత్తం 521 పరుగులు చేసి నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.   

‘నేను కొన్ని మంచి సిరీస్‌లను ఆస్వాదించాను. కానీ, నా క్రికెట్ కెరీర్‌లో 2018-19 బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ అత్యుత్తమ సిరీస్. అప్పుడు నేను బ్యాటింగ్ చేసిన విధానం, ఏకాగ్రత బాగుంది. ఆ సిరీస్‌లో శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడి ఉండేది. ప్రతి మ్యాచ్‌ ఒక సవాలుగా ఉండేది’ అని పుజారా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం అన్ని పరిస్థితుల్లో బాగా ఆడుతోంది. మరికొన్ని రోజుల్లో ఆసీస్, భారత్ మధ్య బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పుజారా  మాట్లాడుతూ.. రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని, ఇలా రసవత్తర పోరు ఉండటం తనకి ఇష్టమని పేర్కొన్నాడు. 

‘ఆస్ట్రేలియాతో మంచి పోటీ ఉంటుంది. వారు మాకు సవాలు విసురుతారు. ఇలాంటి రసవత్తరపోరు నేను ఇష్టపడతాను. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్రికెట్ యుద్ధం. ఆస్ట్రేలియా పోరాడే జట్టు. టీమ్‌ ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఆటగాడిగా జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. నేను ఎన్నో ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాను. వాటిలో చాలా వరకు ఆస్ట్రేలియాపై సాధించినవే’ అని పుజారా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని