IND vs AUS: మూడో వన్డేలో ఆసీస్‌దే గెలుపు.. సిరీస్‌ కైవసం

భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగి ఈ పోరులో ఆసీస్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 22 Mar 2023 22:31 IST

చెన్నై: విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఘోర ఓటమిపాలైన టీమ్‌ఇండియా.. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ ఆటతీరును మార్చుకోలేదు. ఉత్కంఠ భరితంగా సాగిన మూడో వన్డేలోనూ భారత్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.  ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాపై ఆసీస్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ని కంగారులు 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 49.1 ఓవర్లకు 248 పరుగులకే కుప్పకూలింది.

విరాట్ కోహ్లీ (54; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదగా.. హార్దిక్ పాండ్య (40; 40 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) బాగానే ఆడినా భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. రోహిత్ శర్మ (30; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. శుభ్‌మన్‌ గిల్ (37), కేఎల్ రాహుల్ (32) ఫర్వాలేదనిపించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) మరోసారి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగ్గా.. అక్షర్‌ పటేల్ (2) కూడా ఆకట్టుకోలేకపోయాడు. జడేజా (18), షమి (14) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అగర్‌ రెండు, సీన్ అబాట్, స్టాయినిస్‌ ఒక్కో వికెట్ తీశారు. 

ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (33; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్‌ (47; 47 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ (0) డకౌటయ్యాడు. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ కెరీ (38; 46 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మార్నస్‌ లబుషేన్‌ (28), సీన్‌ అబాట్ (26), స్టాయినిస్ (25), డేవిడ్ వార్నర్‌ (23), అగర్‌ (17), మిచెల్ స్టార్క్ (10*), ఆడమ్ జంపా (10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్‌దీప్‌ పాండ్య చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకోగా.. అక్షర్‌ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని