IND vs AUS: భారత్, ఆసీస్‌ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది.

Published : 22 Mar 2023 17:54 IST

చెన్నై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (33; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్‌ (47; 47 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ (0) డకౌటయ్యాడు. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ కెరీ (38; 46 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మార్నస్‌ లబుషేన్‌ (28), సీన్‌ అబాట్ (26), స్టాయినిస్ (25), డేవిడ్ వార్నర్‌ (23), అగర్‌ (17), మిచెల్ స్టార్క్ (10*), ఆడమ్ జంపా (10) పరుగులు చేశారు.భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్‌దీప్‌ పాండ్య చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకోగా.. అక్షర్‌ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.


ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, మిచెల్ మార్ష్‌ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లకు ఆసీస్‌ 61/0తో నిలవడంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. తర్వాత రంగంలోకి దిగిన హార్దిక్‌ పాండ్య తన వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. ట్రావిస్ హెడ్ (33) కుల్‌దీప్‌ యాదవ్‌కు చిక్కగా.. కొద్దిసేపటికే స్టీవ్‌ స్మిత్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత అర్ధ శతకం దిశగా సాగుతున్న మిచెల్ మార్ష్‌ని పాండ్య క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్‌ 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ వార్నర్‌, లబుషేన్‌ కాసేపు నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని ఆపారు. కుల్‌దీప్‌ వేసిన 25 ఓవర్‌లో వార్నర్‌ పాండ్య ఔటయ్యాడు.అనంతరం స్టాయినిస్‌, కెరీ అడపదడపా బౌండరీలు బాదారు. 37 ఓవర్‌లో స్టాయినిస్‌ని అక్షర్‌ పటేల్ వెనక్కి పంపాడు. కాసేపటికే కుల్‌దీప్ బౌలింగ్‌లో కెరీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సీన్‌ అబాట్, అగర్‌ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అక్షర్‌ వేసిన 45 ఓవర్లో అబాట్ ఔట్ కాగా.. సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో అగర్‌ పెవిలియన్‌ చేరాడు. సిరాజ్‌ వేసిన 49 ఓవర్‌లో చివరి బంతికి ఆడమ్‌ జంపా జడేజాకు చిక్కడంతో ఆసీస్‌ ఆలౌటైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు