IND vs AUS Fourth Test : ఫలితం తేలని నాలుగో టెస్టు.. సిరీస్‌ మనదే..

అనుకున్నట్లే నాలుగో టెస్టు (IND vs AUS) ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ టీమ్ఇండియా దూసుకుపోయింది.

Updated : 13 Mar 2023 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా జరిగిన చివరిదైన నాలుగో టెస్టు(IND vs AUS) ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీని భారత్(Team India) 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌(90) రాణించగా..  లబుషేన్‌(63*), స్మిత్‌(10*) నాటౌట్‌గా ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌ , అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా..  ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌ ఫలితం తేలకముందే.. న్యూజిలాండ్‌ చేతిలో లంక ఓటమితో రోహిత్‌ సేన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లోకి చేరింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 66.67 శాతం, భారత్ 58.80 శాతంతో వరుసగా రెండుస్థానాల్లో నిలిచాయి. 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్ : 480

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 571

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 175-2 డిక్లేర్డ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని