India vs Australia - T20 World Cup: భారత్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తుందా.. పొట్టి కప్పులో నేడు స్టార్స్‌ వార్‌!

ప్రపంచకప్‌లో బిగ్‌ఫైట్‌కు సెయింట్ లూసియా వేదికైంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్‌ బృందానికి లభించిన అరుదైన అవకాశంగా అభిమానులు దీనిని భావిస్తున్నారు. 

Updated : 24 Jun 2024 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘భారత ఫ్యాన్స్‌ను మైదానంలో సైలెంట్‌గా కుర్చోబెడతాను’ అంటూ 2023లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ చేసిన కూల్‌ ఛాలెంజ్‌ ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మార్మోగుతోంది. అతడు అన్నంత పనీ చేసి ప్రపంచకప్‌ను వారి జట్టుకు అందించాడు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనే అవకాశం ఇప్పడు పొట్టికప్‌లో భారత్‌కు వచ్చింది. ఈ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. అభిమానులను కుదుటపర్చడంతోపాటు ఆసీస్‌ సెమీస్‌ అవకాశాలకు గండి కొట్టొచ్చు. కానీ, ఇది అంత తేలిక కాదు.. అఫ్గాన్‌ చేతిలో ఓటమితో దెబ్బతిన్న పులిలా ఉన్న ఆసీస్‌ జట్టు నేడు సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఈ మ్యాచ్‌లో బిగ్‌ఫైట్‌ తప్పదన్నమాట..!

ఆసీస్‌ ఓపెనర్స్‌పై బుమ్రాస్త్రం!

భారత స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో పవర్‌ ప్లేలో బుమ్రా ఎకానమీ 2.62 మాత్రమే.. అదే సమయంలో మూడు వికెట్లను పడగొట్టాడు. సెయింట్‌ లూసియా మైదానంలో తూర్పు నుంచి పడమరకు వీచే గాలులు అగ్నిగోళాల్లాంటి అతడి బంతులకు మరింత పదును తీసుకురానున్నాయి. ఆసీస్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లకు ప్రధాన గండం బుమ్రా రూపంలోనే ఉంది. ఈ టోర్నీలో ఎడమ చేతివాటం బ్యాటర్లకు మొత్తం 29 బంతులు వేసి కేవలం రెండు బౌండరీలతో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముగ్గురిని పెవిలియన్‌కు చేర్చాడు. ఆసీస్‌ ఓపెనర్‌ హెడ్‌కు ఆఫ్‌స్టంప్‌నకు దూరంగా వెళ్లే బంతుల విషయంలో ఉన్న బలహీనతను అద్భుతంగా బుమ్రా వాడుకోగలడు. వార్నర్‌ కూడా ఇతడి బౌలింగ్‌లో తడబడతాడని రికార్డులు చెబుతున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో బుమ్రా వేసిన 50 బంతులను ఎదుర్కొన్న వార్నర్‌ 56 పరుగులు మాత్రమే చేశాడు. రెండుసార్లు వికెట్‌ సమర్పించుకొన్నాడు.

పుంజుకోని ఆసీస్‌ పేస్‌ త్రయం..

ఆసీస్‌ పేస్‌ దళంలో కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌ వంటి స్టార్లతో నిండిపోయింది. కానీ, ఈ టోర్నీలో వారు పవర్‌ ప్లేలో 25 ఓవర్లు వేసి కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీసుకొన్నారు. దీంతో ఆశించిన స్థాయిలో రాణించలేదని అర్థమవుతోంది. ఇక 6.40 ఎకానమీతో పరుగులు సమర్పించుకొన్నారు. సెయింట్‌ లూసియా బౌలర్లకు సవాలే. హెజిల్‌వుడ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేస్తే రాణించే అవకాశాలున్నాయి. స్వింగ్‌ లభించకపోతే మాత్రం.. మరో పేసర్‌ స్టార్క్‌కు కష్టాలు తప్పవు. దీంతో అతడి స్థానంలో పవర్‌ ప్లే ఓవర్లకు కమిన్స్‌ రావచ్చొని భావిస్తున్నారు.

రోహిత్‌కు ‘లెఫ్ట్‌’ గండం..

ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత విధ్వంసక ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మూడుసార్లు లెఫ్టార్మ్‌ సీమర్లకు వికెట్లు సమర్పించుకొన్నాడు. దీంతో స్టార్క్‌ నుంచి ముప్పు పొంచి ఉంది. మైదానంలో ఉన్న గాలి దిశను వాడుకొని అతడు స్వింగ్‌ను రాబడితే హిట్‌మ్యాన్‌ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇది జరగకపోతే షార్ట్‌ స్క్వేర్‌లోని 70 మీటర్ల  బౌండరీ లైన్‌ను రోహిత్‌ వాడుకొని హిట్టింగ్‌ చేస్తాడు. ఈ టోర్నీలో సెయింట్‌ లూసియాలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు 7.9 ఎకానమీ రేటుతో బౌలింగ్‌ చేయగా.. పేసర్లది 9.4గా ఉంది. ఈ నేపథ్యంలో స్టార్క్‌ స్థానంలో ఆస్టన్‌ అగర్‌కు అవకాశం లభించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

జంపాను ఎదుర్కోవడమే కీలకం..

మిడిల్‌ ఓవర్లలో ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవడం కీలకం. గత ఆరు మ్యాచుల్లో అతడు 13 వికెట్లు సాధించాడు. అంతేకాదు.. 7 - 16 ఓవర్ల మధ్యలో అతడి ఎకానమీ కేవలం 6 మాత్రమే. వేసిన బంతుల్లో అత్యధికంగా డాట్‌ బాల్సే ఉన్నాయి. భారత్‌ భారీ స్కోర్‌ చేయాలంటే జంపా ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూనే.. గతి తప్పిన బంతుల్ని బౌండరీలు దాటించాలి. లేకపోతే అతడు రన్‌రేట్‌ను తినేయడం ఖాయం. ఇక్కడ సూర్యకుమార్‌ యాదవే కీలక పాత్ర పోషించాలి. 2022, 2023 సంవత్సరాల్లో జరిగిన టీ20ల్లో జంపా వేసిన 27 బంతులను సూర్య ఎదుర్కొన్నాడు. వీటిల్లో 200 స్ట్రైక్‌ రేటుతో 54 పరుగులు సాధించాడు. వీటిల్లో ఐదు సిక్స్‌లు ఉన్నాయి. ఒకసారి వికెట్‌ను సమర్పించుకొన్నాడు. ఇక మన స్కైకి తోడుగా శివం దూబే కూడా విరుచుకుపడితే పరుగుల వరద ఖాయం. 

హార్దిక్‌తో అదనపు బలం..

భారత జట్టుకు హార్దిక్ పాండ్యా అదనపు బలంగా మారాడు. కీలక సమయాల్లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా మారాడు. అతడు 17 - 20 ఓవర్ల మధ్యలో 170కిపైగా స్ట్రైక్‌ రేట్‌తో చెలరేగిపోతున్నాడు. అంతేకాదు బంతితోనూ రాణించి టోర్నీలో 8 వికెట్లు సాధించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 89 పరుగులు చేశాడు. వీటిల్లో ఒక అర్ధశతకం కూడా ఉంది. ఆసీస్‌ వైపు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ ఫామ్‌లో ఉండటం ఒక్కటే భారత్‌కు ఆందోళనకరం. లేటుగా ఫైనల్‌ 11లోకి వచ్చినా వికెట్ల ముందు బ్యాటర్లను దొరకబుచ్చుకోవడంలో కుల్‌దీప్‌ యాదవ్‌ అదరగొడుతున్నాడు. ఆసీస్‌ బ్యాటర్ల జోరును కట్టడి చేయడానికి కుల్‌దీప్‌ ఈ మ్యాచులో కీలకంగా మారతాడు అనడంలో సందేహం లేదు.

  • భారత్‌ - ఆసీస్‌ తలపడిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 19 టీమ్‌ఇండియా విజయం సాధించగా.. 11 కంగారూలు గెలిచారు.    
  • టీ20 ప్రపంచకప్‌ల్లో ఆసీస్‌ - భారత్‌ ఐదుసార్లు తలపడ్డాయి. వీటిల్లో 2007, 2014, 2016లో భారత్‌ విజేతగా నిలిచింది. ఆసీస్‌ 2010, 2012లో గెలిచింది. 
  • ఈ టోర్నీలో గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓటమనేది లేకుండా దూసుకుపోతోంది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. మరోవైపు ఆసీస్‌ గత మ్యాచ్‌లో ఆఫ్గాన్‌ చేతిలో ఓటమి చవిచూసింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని