విహారి, అశ్విన్‌ కాపాడారు.. 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్‌ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా చివరికి 334/5 స్కోర్‌ సాధించింది...

Updated : 11 Jan 2021 13:21 IST

ఆసీస్‌ విజయానికి అడ్డుకట్ట వేశారు..
తృటిలో శతకం చేజార్చుకున్న పంత్‌..

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్‌ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా చివరికి 334/5 స్కోర్‌ సాధించింది. హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4), రవిచంద్రన్‌ అశ్విన్‌(39*; 128 బంతుల్లో 7x4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఆసీస్‌ విజయాన్ని అడ్డుకున్నారు. సోమవారం 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ మరో 3 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు‌ డ్రాగా ముగిసింది.

ఆశలు రేకెత్తించిన పంత్‌, పుజారా.. 

చివరి రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్‌ అజింక్య రహానె(4) విఫలమయ్యాడు. దీంతో భారత్‌ 102 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన పుజారా(77; 205 బంతుల్లో 12x4), పంత్‌(97; 118 బంతుల్లో 12x4, 3x6) తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవైపు పంత్‌ ధాటిగా ఆడగా, మరోవైపు పుజారా డిఫెన్స్‌ చేశాడు. అలా వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి జట్టు స్కోర్‌ను 70 ఓవర్లలో 206/3కి తీసుకెళ్లారు. దీంతో భారత్‌ విజయంపై ఆశలు రేకెత్తాయి. అయితే, రెండో సెషన్‌లో పంత్‌ శతకానికి చేరువైన వేళ లైయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్క్వేర్‌లెగ్‌ మీదుగా షాట్‌ ఆడడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కమిన్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్‌‌ స్కోర్‌ 250/4గా నమోదైంది. 

సహనానికి పరీక్ష..

అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న పుజారా ధాటిగా ఆడే క్రమంలో జట్టు స్కోర్‌ 272 పరుగుల వద్ద హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విహారి, అశ్విన్‌ మరో వికెట్‌ పడకుండా రెండో సెషన్‌ను 280/5తో ముగించారు. ఇక చివరి సెషన్‌లో మరింత రక్షణాత్మకంగా ఆడిన వారిద్దరూ‌ ఆసీస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చివరి వరకు క్రీజులో పాతుకుపోయారు. భారత్‌ను ఓటమి నుంచి తప్పించాలనే పట్టుదలతో కనిపించారు. దాంతో ఆసీస్‌ విజయానికి అడ్డుకట్ట వేశారు. చివరికి వారిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆస్ట్రేలియా శనివారం 312/6 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆ జట్టుకు 94 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 

స్కోర్‌ బోర్డు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338 ఆలౌట్‌; స్మిత్‌ 131, లబుషేన్‌ 91; జడేజా 4 వికెట్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 244 ఆలౌట్‌; పుజారా 50, గిల్‌ 50; కమిన్స్‌ 4 వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 312/6 డిక్లేర్డ్‌; గ్రీన్‌ 84, స్మిత్‌ 81; సైని 2 వికెట్లు
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 334/5; పంత్‌ 97, పుజారా 77; హేజిల్‌వుడ్‌ 2 వికెట్లు

ఇవీ చదవండి..
షోయబ్‌ మాలిక్‌కు తప్పిన ప్రమాదం
క్రికెటెప్పుడూ వివక్ష చూపదు: సచిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని