Suryakumar Yadav: మూడుసార్లు గోల్డెన్‌ డక్.. సూర్యకుమార్‌ పేరిట ఓ చెత్త రికార్డు

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన భారత బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Published : 23 Mar 2023 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతడి ఆటతీరు మరీ పేలవంగా ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఆడిన తొలి బంతికే సూర్య గోల్డెన్‌ డక్‌ (Golden Duck)గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో స్టార్క్‌ బౌలింగ్‌లో ఒకే విధంగా వికెట్ల ముందు దొరికిపోయిన సూర్య.. మూడో మ్యాచ్‌లో అగర్‌ బంతిని అర్థం చేసుకోలేక క్లీన్‌ బౌల్డయ్యాడు. అగర్‌ వేసిన స్ట్రెయిట్ లెంగ్త్ బాల్‌కు బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి మిస్ అయి వికెట్లను తాకింది. దీంతో ఖాతా తెరవకుండానే సూర్య నిరాశతో మైదానాన్ని వీడాడు. 

మూడో వన్డేలో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సూర్య అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓ వన్డే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డక్‌ అయిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా వన్డేల్లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన ఆరో భారత ఆటగాడిగా పేరు నమోదు చేసుకొన్నాడు. సూర్యకుమార్‌ కంటే ముందు సచిన్‌, అనిల్‌ కుంబ్లే, ఇషాంత్ శర్మ, జహీర్‌ ఖాన్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఒక్క పరుగూ చేయకుండానే పెవిలియన్‌ చేరారు. వన్డేల్లో అత్యధికసార్లు డక్‌ అయిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్‌ లసిత్ మలింగ పేరిట ఉంది. మలింగ వరుసగా నాలుగుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. గుస్ లోగీ (వెస్టిండీస్‌), ప్రమోద్య విక్రమసింఘే (శ్రీలంక), హెన్రీ ఒలోంగా (జింబాబ్వే), క్రెయిగ్ వైట్ (ఇంగ్లాండ్‌) కూడా వన్డేల్లో ఒక్క పరుగూ చేయకుండానే క్రీజును వీడారు.

ఇక భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 2019 ఏప్రిల్‌ తర్వాత స్వదేశంలో భారత్‌కిదే తొలి వన్డే సిరీస్‌ ఓటమి. మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా అగ్రస్థానాన్ని కోల్పోయింది. భారత్‌ని ఓడించిన ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌లోని దక్కించుకుంది.  113.286 రేటింగ్ పాయింట్లతో ఆసీస్‌.. తొలి స్థానంలో ఉండగా..  భారత్‌ 112.638 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని