IND Vs BAN Updates: రోహిత్ అద్భుత పోరాటం.. అయినా ఐదు పరుగుల తేడాతో భారత్‌ ఓటమి

రెండో వన్డే మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. అయితే గాయంతో బాధపడుతూనే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ (51*) భారత్‌ను గెలిపించినంత పని చేశాడు. చివరికి ఐదు పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. భారత ఓటమికి ప్రధానం కారణం 47వ ఓవర్‌లో ఒక పరుగు, 48వ మెయిడిన్‌ కావడమే. 

Updated : 08 Dec 2022 16:11 IST


మిర్పూర్‌: చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైన సందర్భంలో రోహిత్ శర్మ (51*: 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అయితే ముస్తాఫిజర్‌ స్లో బంతులు వేయడంతో ఈ ఓవర్‌లో 14 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరికి భారత్ 50 ఓవర్లకు 266/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2-0 తేడాతో కైవసం చేసుకొంది. చివరి మ్యాచ్‌ చిట్టగాంగ్‌ వేదికగా శనివారం జరగనుంది.


రసవత్తరంగా మ్యాచ్‌

రోహిత్ శర్మ (37*) దూకుడుతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 20 పరుగులు అవసరం. అంతకుముందు మహముదుల్లా వేసిన 49వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో సహా 20 పరుగులు రాబట్టారు. అయితే చివరి బంతికి సిరాజ్‌ (2) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక 47వ ఓవర్‌లో ఒక పరుగు, 48వ ఓవర్‌ మెయిడిన్‌ కావడం గమనార్హం.


ఈసారి దీపక్‌

భారత్ మరో వికెట్‌ను చేజార్చుకొంది. ఆడతాడేమోనని భావించిన దీపక్ చాహర్ (11) ఎబాడట్‌ బౌలింగ్‌లో (45.1వ ఓవర్) షాట్‌కు యత్నించి షాంటో చేతికి చిక్కాడు. దీంతో భారత్ 213 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. ఎబాడట్‌ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ (16*) రెండు సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ప్రస్తుతం 46 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 231/8. క్రీజ్‌లో రోహిత్ శర్మతోపాటు సిరాజ్‌ (1*) ఉన్నాడు. ఇంకా 24 బంతుల్లో 41 పరుగులు చేస్తే భారత్‌దే విజయం.


బ్యాటింగ్‌కు రోహిత్

కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చాడు. షకిబ్‌ వేసిన (42.4వ ఓవర్) బంతిని ఆడబోయిన శార్దూల్ ఠాకూర్ (7) స్టంప్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 207 పరుగుల వద్ద భారత్‌ ఏడో వికెట్‌ను కోల్పోయింది. అయితే గాయం కారణంగా డగౌట్‌కు పరిమితమైన రోహిత్ (1*) బ్యాటింగ్‌ రావడం విశేషం. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 208/7.


పెవిలియన్‌కు చేరిన అక్షర్

బౌలింగ్‌ మార్పు బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది. ఎబాడట్‌ వేసిన (38.2వ ఓవర్‌) బంతిని షాట్‌ కొట్టేందుకు యత్నించిన అక్షర్‌ పటేల్ (56) షకిబ్ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 189 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు 193/6. క్రీజ్‌లో దీపక్ చాహర్ (1*), శార్దూల్ ఠాకూర్ (4*) ఉన్నారు. చివరి 60 బంతుల్లో 79 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది.


శ్రేయస్‌ ఔట్

సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతుండటంతో భారత బ్యాటర్లు దూకుడు పెంచారు. ఈ క్రమంలో అర్ద శతకంతో జోరు మీద కనిపించిన శ్రేయస్‌ అయ్యర్ (82) ఔటయ్యాడు. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ దగ్గర అఫీఫ్‌కి చిక్కాడు. 35 ఓవర్లు ముగసేసరికి భారత్‌ స్కోరు 172/5గా ఉంది. క్రీజులో అక్షర్‌ పటేల్‌ (43) ఉన్నాడు. 


ఇన్నింగ్స్‌ నిలబెట్టేలా...

భారత బ్యాటర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ (68*), అక్షర్ పటేల్ (28*) నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో పరుగులు రాబడుతున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఐదో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు 143/4. భారత్ విజయం సాధించాలంటే మిగతా 120 బంతుల్లో 129 పరుగులు చేయాలి.


శ్రేయస్‌ హాఫ్ సెంచరీ

శ్రేయస్ అయ్యర్ (50*), అక్షర్ పటేల్ (21*) ఐదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌లో ఇదే మంచి పార్టనర్‌షిప్‌. ఈ క్రమంలో శ్రేయస్‌ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో 155 పరుగులు చేస్తే భారత్‌ విజయం సాధిస్తుంది. వీరిద్దరే కాకుండా దీపక్ చాహర్, శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రమే కాస్త బ్యాటింగ్‌ చేయగలరు. గాయం కారణంగా రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే.


రాహుల్‌ ఔట్

భారత్‌కు మరో దెబ్బ తగిలింది. కీలకమైన కేఎల్ రాహుల్ (14) పెవిలియన్‌కు చేరాడు. మెహిదీ హసన్‌ బౌలింగ్‌లో (18.3వ ఓవర్‌) ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో 65 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌కు కోల్పోయింది. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు 80/4. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్ (30*), అక్షర్ పటేల్ (6*) ఉన్నారు. చివరి 30 ఓవర్లలో 192 పరుగులు చేస్తే భారత్‌ విజయం సాధిస్తుంది.


నిలదొక్కుకొన్న బ్యాటర్లు

వికెట్ల పతనానికి కాస్త అడ్డుపడింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయిన భారత్‌ను కేఎల్ రాహుల్ (7*), శ్రేయస్‌ అయ్యర్ (22*) ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో పరుగులు రాక మందగించింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు 56/3. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తున్నారు. భారత్ విజయానికి 35 ఓవర్లలో 216 పరుగులు అవసరం.


సుందర్‌ ఔట్

మూడో వికెట్ పడింది. శ్రేయస్‌ అయ్యర్‌ (14*)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించిన వాషింగ్టన్ సుందర్ (11) షకిబ్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 39/3. క్రీజ్‌లో అయ్యర్‌తోపాటు కేఎల్ రాహుల్ ఉన్నాడు. టీమ్‌ఇండియా విజయానికి 40 ఓవర్లలో ఇంకా 233 పరుగులు చేయాల్సి ఉంది.


ఓపెనర్లు పెవిలియన్‌కు..

లక్ష్య ఛేదనలో భారత్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (5), శిఖర్ ధావన్‌ (8) పెవిలియన్‌కు చేరారు. విరాట్‌ను ఎబాడట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా.. ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో మెహిదీకి క్యాచ్‌ ఇచ్చి ధావన్‌ ఔట్ అయ్యాడు. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్ (4*), వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 271/7 స్కోరు చేసింది.


బంగ్లాదేశ్‌ 271/7

బంగ్లాదేశ్‌ 19 ఓవర్లకు 69/6.. టాప్‌ఆర్డర్‌ అంతా పెవిలియన్‌కు చేరింది. ఇక వందలోపే బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు చుట్టేస్తారని అంతా అనుకొన్నారు. ఒక బ్యాటరే సెంచరీ సాధించడం విశేషం. మరోసారి బంగ్లా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన మెహిదీ హసన్ (100*: 83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), మహముదుల్లా (77: 96 బంతుల్లో 7 ఫోర్లు),  కుదురుకొన్నాక దూకుడు పెంచారు. ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించారు. ఏ వికెట్‌కైనా భారత్‌పై ఇదే బంగ్లాదేశ్‌ అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం. ఇదే క్రమంలో మెహిదీ సెంచరీ బాదేశాడు.

భారత బౌలర్లు కీలకమైన సమయంలో పట్టు వదలడంతో వంద పరుగులే కష్టమని భావిస్తే.. బంగ్లాదేశ్‌ ఏకంగా 250 మార్క్‌ను దాటేసింది. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన నసుమ్‌ అహ్మద్ (18*: 11 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) ఎనిమిదో వికెట్‌కు మెహిదీతో కలిసి 54 పరుగులు జోడించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, సిరాజ్ 2, ఉమ్రాన్‌ మాలిక్ 2 వికెట్లు తీశారు.


ఎట్టకేలకు వికెట్‌

ఎట్టకేలకు ఏడో వికెట్‌ పడింది. 148 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో (46.1వ ఓవర్) బంతిని ఆడబోయిన మహముదుల్లా (77) వికెట్‌ కీపర్‌ కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 217 పరుగుల వద్ద బంగ్లా ఏడో వికెట్‌ను నష్టపోయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నసుమ్‌ అహ్మద్ (9*) బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. ప్రస్తుతం 47 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 231/7 స్కోరు సాధించింది. క్రీజ్‌లో నసుమ్‌తోపాటు మెహిదీ (70*) ఉన్నాడు. ఈ ఓవర్‌లో ఐదు బంతుల్లో మూడు ఫోర్లు రావడం గమనార్హం.


రెండొందలు దాటిన స్కోరు

బంగ్లాదేశ్‌ స్కోరు రెండు వందలు దాటేసింది. ఏడో వికెట్‌కు ఏకంగా 134 పరుగులు జోడించి తమ జట్టును సురక్షిత స్థానంలో నిలిపడంలో మహముదుల్లా (62*), మెహిదీ హసన్ మిరాజ్ (65*) కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిగిలిన ఐదు ఓవర్లలో బంగ్లా బ్యాటర్లు దూకుడుగా ఆడే అవకాశం లేకపోలేదు. 


సెంచరీ పార్టనర్‌షిప్‌..

ఏడో వికెట్‌కు బంగ్లాదేశ్‌ బ్యాటర్లు మహముదుల్లా (47*), మెహిదీ (53*) వంద పరుగులు జోడించారు. ఈ క్రమంలో మెహిదీ అర్ధశతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వికెట్‌ తీసేందుకు భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం రావడం లేదు. చివరి పది ఓవర్లలో బంగ్లాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. గాయంతో మైదానం వీడిన రోహిత్ శర్మ..  వేలికి కట్టుతో డగౌట్‌లో కనిపించాడు. ఎక్స్‌రే అనంతరం తిరిగి స్టేడియానికి వచ్చాడు.


పుంజుకొన్న బంగ్లా

స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన బంగ్లాదేశ్ పుంజుకొంది. తొలి వన్డేలో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన మెహిదీ హసన్ (44*) మరోసారి రాణించాడు. మహముదుల్లా (35*)తో కలిసి ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ 35 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.


అర్ధశతకం చేసేశారు..

బంగ్లాదేశ్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు మహముదుల్లా (26*), మెహిదీ (31*) అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. కేవలం 66  బంతుల్లో 55 పరుగులు రాబట్టారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.


పట్టు సడలించారు..

భారత బౌలర్లు కాస్త పట్టు సడలించారు. వరుసగా వికెట్లను తీసిన భారత్‌.. ఆరు ఓవర్ల నుంచి ఒక్కటీ దక్కలేదు. మెహిదీ హసన్ (12*), మహముదుల్లా (17*) క్రీజ్‌లో పాతుకుపోయి పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ ఆరు ఓవర్లలో 27 పరుగులు జోడించారు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 25 ఓవర్లకు 96/6. తొలి వన్డేలా చివరి వికెట్లు తీయకపోతే బంగ్లా పుంజుకొనే అవకాశం ఉంది.


వరుసగా మూడు..

బంగ్లాదేశ్ వరుసగా మూడు కీలక వికెట్లను కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఫ్లైటెడ్‌ డెలివరీని (16.6వ ఓవర్) అర్థం చేసుకోవడంలో విఫలమైన షకిబ్ (8) శిఖర్ ధావన్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఆ క్యాచ్‌ను కూడా ధావన్‌ వదిలేసేవాడే.. అయితే అదృష్టం కొద్దీ బంతి కాళ్ల మధ్యలో ఆగిపోవడంతో అందుకోగలిగాడు. అనంతరం 18వ ఓవర్‌ను ఉమ్రాన్‌ మాలిక్ మెయిడిన్‌ ఓవర్‌గా వేశాడు. మరోసారి వాషింగ్టన్‌ సుందర్ బౌలింగ్‌లో ముష్ఫికర్‌ (12) ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అయితే అంపైర్‌ తొలుత నాటౌట్‌గా ప్రకటించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన భారత్‌కు సమీక్షలో పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. అనంతరం వచ్చిన అఫిఫ్‌ (0)ను సుందర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. సుందర్‌ హ్యాట్రిక్‌ మీద ఉన్నాడు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 69/6.  క్రీజ్‌లో మహముదుల్లా, మెహిదీ ఉన్నారు.


షాంటో క్లీన్‌బౌల్డ్‌

స్వల్ప వ్యవధిలో బంగ్లాదేశ్‌ను ఉమ్రాన్‌ మాలిక్‌ దెబ్బ కొట్టాడు. కుదురుగా ఆడిన షాంటో (21)ను 151 కి.మీ వేగంతో వేసిన బంతి క్లీన్‌బౌల్డ్‌ చేసింది. దీంతో 52 పరుగుల వద్ద (13.1వ ఓవర్‌) బంగ్లా మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌ (5*) బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజ్‌లో ముష్ఫికర్‌తోపాటు షకిబ్ (5*) ఉన్నాడు. 


రెండో వికెట్‌

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తుండటంతో బంగ్లాదేశ్‌ రెండో వికెట్‌ను చేజార్చుకొంది. సిరాజ్‌ వేసిన (9.2వ ఓవర్‌) బంతికి లిటన్ దాస్ (7) క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 39 పరుగుల వద్ద బంగ్లా రెండో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం 10  ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 44/2. క్రీజ్‌లో షాంటో (15*), షకిబ్ (4*) ఉన్నారు. రెండో ఓవర్‌లో వేలికి గాయంతో మైదానం వీడిన టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మను ఆస్పత్రికి తరలించారు. సిరాజ్‌ వేసిన బంతిని ఆడిన అన్‌మోల్‌ స్లిప్‌లో ఆదుకొనేందుకు రోహిత్‌ ప్రయత్నించగా.. వేలికి గాయమైంది. ఎక్స్‌రే రిపోర్ట్‌ను బట్టి బీసీసీఐ తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.


నెమ్మదిగా ఆడుతూ.. 

ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోవడంతో బంగ్లా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 30 పరుగులు చేశారు. దాస్‌ 7, నజ్ముల్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.


బంగ్లా తొలి వికెట్‌ తీసిన సిరాజ్‌..

బంగ్లా ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌లో ఫోర్లతో దూకుడుగా ఆడిన ఓపెనర్‌ అనముల్‌(11) అదే ఓవర్‌ ఐదో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం నజ్ముల్‌ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసింది.


బ్యాటింగ్‌ ఆరంభించిన బంగ్లా..

టాస్‌ నెగ్గిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. లిటన్‌ దాస్‌, అనముల్‌ హఖ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. తొలి ఓవర్‌ ముగిసే సరికి బంగ్లా ఒక పరుగు చేసింది. భారత్‌ తరఫున దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ప్రారంభించాడు.


బంగ్లా జట్టు ఇదే..


భారత జట్టులో రెండు మార్పులు..

రెండే వన్డేలో టీమ్‌ఇండియా జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. షాబాద్‌ అహ్మద్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకున్నారు. ఇక తొలి వన్డేలో అరంగేట్రం చేసిన కుల్‌దీప్‌ సేన్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సూచన మేరకు అతడికి విశ్రాంతినిచ్చి.. ఆ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటుకల్పించారు.


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా..

మిర్పూర్‌ వేదికగా భారత్‌-బంగ్లా మధ్య రెండో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన బంగ్లా బ్యాటింగ్‌ ఎంచుకుంది. సిరీస్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన తప్పక గెలవాలి.


నేడు బంగ్లాతో రెండో వన్డే.. భారత్‌కు పరీక్ష

మిర్పూర్‌ :  తొలి వన్డే(IND Vs BAN) ఓటమితో పెద్ద షాక్‌లో ఉన్న భారత్(Team India)‌.. నేడు బంగ్లాదేశ్‌(Bangladesh)తో రెండో వన్డేకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ కూడా ఓడితే బంగ్లా గడ్డపై వరుసగా రెండో వన్డే సిరీస్‌ చేజారుతుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. తప్పక నెగ్గాల్సిన రెండో వన్డేలో బుధవారం ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఒత్తిడి భారత్‌పైనే. ఆటను రోహిత్‌సేన బాగా మెరుగుపర్చుకోవాల్సివుంది. తొలి వన్డేలో గెలిచిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని