IND vs BAN: ముగిసిన చివరి టెస్టు రెండో రోజు ఆట.. భారత్‌దే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట కొనసాగుతోంది. నిన్న బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత్‌.. నేడు తొలుత బ్యాటింగ్‌లో తడబడినా.. ఆ తర్వాత కుదురుకుంది. 

Updated : 23 Dec 2022 17:15 IST

భారత్, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లా 227 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో 87 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి బంగ్లా తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా ఆరు ఓవర్లలో ఏడు పరుగులు చేసింది. క్రీజ్‌లో జకీర్ హసన్ (2*), షాంటో (5*) ఉన్నారు. అంతకుముందు రిషభ్‌ పంత్ (93), శ్రేయస్‌ అయ్యర్ (87) సెంచరీలను మిస్‌ చేసుకున్నారు.


భారత్ 314 ఆలౌట్ 

బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 86.3 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రిషభ్‌ పంత్ (93), శ్రేయస్‌ అయ్యర్ (87) అర్ధశతకాలు సాధించారు. మిగిలిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 10, శుబ్‌మన్ గిల్ 20, ఛెతేశ్వర్ పుజారా 24, విరాట్ కోహ్లీ 24, అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, ఉమేశ్‌ యాదవ్ 14, జయ్‌దేవ్ ఉనద్కత్ 14*, సిరాజ్ 7 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్ 4, షకిబ్ 4.. తస్కిన్, మెహిదీ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బంగ్లా తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.


భారత్‌ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకొంది. రిషభ్‌ పంత్‌ ఔటైన కాసేపటికే అక్షర్‌ పటేల్ (4), రవిచంద్రన్ అశ్విన్ (13), శ్రేయస్ అయ్యర్ (87)  ఔటయ్యారు. దీంతో 81 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. క్రీజ్‌లో జయదేవ్ (9*), ఉమేశ్‌ యాదవ్ (5*) ఉన్నారు. దీంతో బంగ్లాపై టీమ్‌ఇండియా 65 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.


సెంచరీకి ఏడుపరుగుల దూరంలో రిషభ్ పంత్ (93) పెవిలియన్‌కు చేరాడు. దీంతో శ్రేయస్ అయ్యర్‌ (79*)తో కలిసి ఐదో వికెట్‌కు నిర్మించిన 159 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్‌ 68 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 26 పరుగులకు చేరింది. క్రీజ్‌లో శ్రేయస్‌తోపాటు అక్షర్ ఉన్నాడు.


హమ్మయ్య గట్టెక్కాం..! స్వల్ప వ్యవధిలోనే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను.. రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఆదుకున్నారు. మెరుపు షాట్లతో స్కోరు బోర్డును పరుగులుపెట్టించారు. శ్రేయస్‌ అర్ధశతకంతో చెలరేగగా.. పంత్‌ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. దీంతో భారత్‌ దాదాపు ఆధిక్యంలోకి వచ్చినట్లే. టీ విరామ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్‌ (86*), అయ్యర్‌ (58*) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.


రెండో టెస్టులో టీమ్‌ఇండియా స్కోరు 200 దాటింది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా.. రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ జట్టును ఆదుకున్నారు. దీంతో భారత్‌ ఆధిక్యానికి చేరువైంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. క్రీజులో పంత్‌(78*), శ్రేయస్‌ (42*) ఉన్నారు. ఇంకో 25 పరుగులు చేస్తే బంగ్లా స్కోరును దాటేస్తుంది.


రెండో టెస్టులో భారత్‌ నిలకడగా ఆడుతోంది. కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్‌ అర్ధశతకం సాధించాడు. 49 ఓవర్లు ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 160 పరుగులు చేసింది. బంగ్లా స్కోరుకు ఇంకా 67 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో పంత్‌(50*), శ్రేయస్‌ (29*) ఉన్నారు.


రెండో టెస్టులో భారత్‌ మరింత కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న కోహ్లీ(24)ని లంచ్‌ విరామం తర్వాత బంగ్లా బౌలర్‌ టస్కిన్ అహ్మద్‌ దెబ్బకొట్టాడు. 38వ ఓవర్‌లో టస్కిన్‌ వేసిన నాలుగో బంతిని షాటే ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. నురుల్‌ హసన్‌ చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 94 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. బంగ్లా స్కోరుకు భారత్‌ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో పంత్(14*), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.


రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌లో తడబడుతోంది. బంగ్లా బౌలర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ ధాటికి ఆదిలోనే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఇక ఆశలన్నీ కోహ్లీపైనే. భోజన విరామ సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. బంగ్లా స్కోరు కంటే ఇంకా 141 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో కోహ్లీ(18*), పంత్(12*) ఉన్నారు. బంగ్లాపై భారీ స్కోరు సాధించాలంటే వీరిద్దరూ క్రీజులో స్థిరపడాల్సిందే.


రెండో టెస్టులో భారత్‌ కష్టాల్లో పడుతోంది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయిన తర్వాత ఛతేశ్వర్‌ పుజారా, కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బంగ్లా బౌలర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. 31వ ఓవర్‌లో పుజారా(24)ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో భారత్‌ మూడో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 73 పరుగులు చేసింది. బంగ్లా  స్కోరు కంటే ఇంకా 154 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో విరాట్‌ కోహ్లీ(16*), రిషభ్‌ పంత్‌ (1*) ఉన్నారు.


మీర్పూర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. తొలి రోజు బౌలింగ్‌తో అదరగొట్టిన భారత్‌.. బ్యాటింగ్‌లో తడబడుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 19/0తో బ్యాటింగ్‌ కొనసాగించిన టీమ్‌ ఇండియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. తాత్కాలిక సారథి, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపర్చగా.. శుభ్‌మన్‌ గిల్‌ కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. 14వ ఓవర్‌లో తైజుల్‌ ఇస్లామ్‌ వేసిన తొలి బంతికి రాహుల్ (10) ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో మళ్లీ తైజుల్‌.. గిల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో ఛతేశ్వర్‌ పుజారా(10*), విరాట్‌ కోహ్లీ ఉన్నారు.

తొలి రోజు భారత్‌ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. పేస్‌తో ఉమేశ్ యాదవ్‌, స్పిన్‌తో అశ్విన్‌ మ్యాచ్‌ను తిప్పేశారు. బంగ్లా జట్టును 227కు కట్టడి చేశారు. ఆతిథ్య జట్టులో మొమినుల్‌ హక్‌(84) మినహా ఎవరూ రాణించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని