icc mens t20 world cup: చివరిది వరుణుడికి

అనుకున్నదే జరిగింది. గ్రూప్‌- ఎ లో భారత్‌ చివరి మ్యాచ్‌ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్‌- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్‌ఇండియా ఆశ తీరలేదు.

Updated : 16 Jun 2024 06:49 IST

వర్షంతో భారత్, కెనడా మ్యాచ్‌ రద్దు 
లాడర్‌హిల్‌


నుకున్నదే జరిగింది. గ్రూప్‌- ఎ లో భారత్‌ చివరి మ్యాచ్‌ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్‌- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్‌ఇండియా ఆశ తీరలేదు. శనివారం భారత్, కెనడా మ్యాచ్‌ రద్దయింది. మ్యాచ్‌ ఆరంభ సమయానికంటే ముందే వర్షం ఆగిపోయినా.. తడి ఔట్‌ఫీల్డ్‌ కారణంగా ఆట సాగే పరిస్థితులు లేకుండా పోయాయి. ఒకటికి రెండు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు టాస్‌ కూడా వేయకుండానే మ్యాచ్‌ రద్దయినట్లు ప్రకటించారు. దీంతో టీమ్‌ఇండియా, కెనడాకు చెరో పాయింట్‌ దక్కింది. ఇప్పటికే సూపర్‌- 8కు అర్హత సాధించిన రోహిత్‌ సేన.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ రద్దుతో కలిపి అగ్రస్థానం (7 పాయింట్లు)తో గ్రూప్‌ దశను ముగించింది. ఈ గ్రూప్‌ నుంచి ముందంజ వేసిన మరో జట్టు అమెరికా (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమి, ఓ రద్దు) 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కెనడా మూడు పాయింట్లతో నిష్క్రమించింది. అమెరికాలో గ్రూప్‌ దశను పూర్తిచేసిన భారత్‌ ఇక సూపర్‌- 8 కోసం వెస్టిండీస్‌ వెళ్లనుంది. అక్కడ అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియాతో పాటు మరో జట్టు (ఇంకా తేలలేదు)తో టీమ్‌ఇండియా తలపడుతుంది. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లాడిన రోహిత్‌ సేన సంతృప్తికర ప్రదర్శనే చేసింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్, పంత్‌.. పాకిస్థాన్‌పై పంత్‌.. అమెరికాతో పోరులో సూర్యకుమార్, శివమ్‌ దూబె బ్యాటింగ్‌లో రాణించారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్‌ సత్తాచాటారు. స్పిన్నర్లతో పాటు కోహ్లి కూడా తర్వాతి మ్యాచ్‌ల్లో జోరు అందుకుంటే జట్టుకు తిరుగుండదు. 

కవర్లు లేని చోట మ్యాచ్‌లు వద్దు 

దిల్లీ: మొత్తం మైదానాన్ని కప్పడానికి కవర్లు లేని చోట ఐసీసీ మ్యాచ్‌లు నిర్వహించకూడదని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. పచ్చి ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా భారత్, కెనడా మధ్య శనివారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌ రద్దయిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. వర్షం లేకున్నా లాడర్‌హిల్‌లో భారత్‌-కెనడా మ్యాచ్‌ సాధ్యం కాలేదు. ఉదయం కురిసిన వాన వల్ల ఔట్‌ ఫీల్డ్‌ పచ్చిగా ఉండడమే అందుకు కారణం. ఇదే మైదానంలో అంతకుముందు రోజు అమెరికా-ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దయింది. వరుసగా మ్యాచ్‌లు రద్దు కావడంతో గావస్కర్‌.. ఐసీసీని తప్పుపట్టాడు. ‘‘ఒక్క పిచ్‌నే కప్పి మైదానంలో మిగతా ప్రాంతాలను వదిలేయకూడదు’’ అని గావస్కర్‌ అన్నాడు. ‘‘మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు ఎందుకు లేవో అర్థం కావట్లేదు. ఇంత డబ్బున్నా.. ఔట్‌ఫీల్డ్‌ పచ్చిగా ఉన్న కారణంగా ఇప్పటికీ మ్యాచ్‌లు రద్దువుతున్నాయి’’ అని మైకెల్‌ వాన్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని