IND vs ENG: టీ20 వరల్డ్‌ కప్‌ ‘2022 సీన్‌ 2024లో రిపీట్’.. ఈసారి రివెంజ్‌ చూస్తామా?

టీ20 ప్రపంచ కప్‌లో మరోసారి పాత ప్రత్యర్థులు తలపడేందుకు సిద్ధమయ్యారు. గత ఎడిషన్‌ సెమీస్‌లో ఈ జట్లే ఢీకొట్టుకోగా.. ఇప్పుడు మళ్లీ ఎదురుపడటం గమనార్హం.

Updated : 25 Jun 2024 15:22 IST

అది 2022.. సూపర్‌ - 12 స్టేజ్‌లో అగ్రస్థానంతో భారత్ సెమీస్‌కు చేరుకుంది. రెండు అడుగులు వేస్తే సుదీర్ఘంగా వేచి చూస్తున్న రెండో కప్ నిరీక్షణకు బ్రేక్‌ పడుతుందని అంతా భావించారు. కానీ, ఇంగ్లాండ్‌ రూపంలో అవాంతరం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన పోరాటంలో ఇంగ్లిష్ జట్టు విజేతగా నిలిచింది. 

ఇప్పుడు 2024.. లీగ్‌ స్టేజ్‌లో భారత్‌కు తిరుగు లేదు. సూపర్‌ - 8లోనూ హవా మనదే. అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకొచ్చింది. ఒక్కసారిగా అభిమానుల ఆలోచనలు రెండేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. అప్పటి సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా? భారత్ రివెంజ్‌ ప్లాన్‌ చేస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ. ఎందుకంటే ఈసారి సెమీస్‌ ఇంగ్లాండ్‌తోనే!

టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరు ముగిసింది. రెండు గ్రూప్‌ల నుంచి భారత్‌, అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ సెమీస్‌కు చేరాయి. గురువారం రాత్రి జరగనున్న రెండో సెమీఫైనల్‌లో భారత్‌ - ఇంగ్లాండ్‌ తలపడతాయి. మామూలుగా అయితే ఇది స్టార్స్‌ వార్‌కి మించింది అని చెప్పాలి. అయితే రెండేళ్ల క్రితం మన జట్టుకు ఎదురైన పరాభవం దృష్ట్యా ఇది రివెంజ్‌. 2022లో సెమీస్‌లో మన మీద 10 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ సేన ఘన విజయం సాధించింది. ఆ ఓటమిని మరచిపోవడం అంత ఈజీ కాదు అని మాజీలు ఇప్పటికీ అంటుంటారు. అయితే అంతకుమించిన రివెంజ్‌ తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్‌కి వచ్చింది. 

దూసుకొచ్చిన ఇంగ్లాండ్

ఈ పొట్టి కప్‌ లీగ్‌ స్టేజ్‌, సూపర్‌-8లో టీమ్‌ఇండియా పెద్దగా ఒత్తిడికి గురికాకుండానే నాకౌట్‌కు చేరింది. చిన్న టీమ్‌, పెద్ద టీమ్‌ అనే తేడా లేకుండా అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్‌కి వచ్చింది. కానీ, ఇంగ్లాండ్‌ అలా కాదు. కష్టాలు పడి వచ్చిన ఆ టీమ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. టీ20 ప్రపంచ కప్ ముందు వరకు ఇంగ్లాండ్‌ అలవోకగా సెమీస్‌కు వస్తుందని భావించారు. తీరా, టోర్నీ ప్రారంభమయ్యాక ఆ జట్టు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. లీగ్‌ స్టేజ్‌ను దాటి సూపర్‌ 8కి రావడమే గొప్పగా పరిస్థితి మారిందంటే ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు.

సూపర్‌-8కి వచ్చాక వాళ్ల బ్రాండ్‌ ఆటతీరును బయటకు తెచ్చారు. తొలుత ఆతిథ్య విండీస్‌ను అలవోకగా చిత్తు చేసింది. అప్పటివరకు ప్రత్యర్థులను హడలెత్తించిన వెస్టిండీస్‌ ఇంగ్లాండ్‌ ముందు పసికూనగా మారిపోయింది. ఇక దక్షిణఫ్రికాతో స్వల్ప తేడాతో మాత్రమే ఇంగ్లిష్ టీమ్‌ ఓడింది. ఇక చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు ఉంటాయని తెలిసిన ఇంగ్లాండ్‌ ఏమాత్రం బెరుకు చూపించలేదు. యూఎస్‌ఏపై అమాంతం విరుచుకుపడింది. అప్పటివరకు వరల్డ్‌ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అమెరికా బట్లర్‌ దూకుడుకు కుదేలైంది.

భారత్‌కు వీరు.. ఇంగ్లాండ్‌లో వారు

భారత జట్టులోని ప్రతి ఒక్కరూ తమకొచ్చిన అవకాశాలకు న్యాయం చేసేందుకు కష్టపడ్డారు. కెప్టెన్‌ రోహిత్ ఓపెనర్‌గా దూకుడుగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆసీస్‌పై కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు రాబట్టి.. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఎవరూ ఊహించని విధంగా వన్‌డౌన్‌లో వస్తూ రిషభ్‌ పంత్‌ అదరగొట్టేస్తుండగా.. నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ సూర్య ఆ ఘనత ఎందుకొచ్చిందో మరోసారి నిరూపిస్తున్నాడు. వరల్డ్‌ కప్‌ ముందు వరకు ‘హార్దిక్ ఎందుకు?’ అన్నవారే.. ఇప్పుడు ‘మన హార్దిక్‌’ అంటున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

అయితే విరాట్‌ కోహ్లీ ప్రదర్శనే ఇబ్బంది పెడుతోంది. అంతర్జాతీయ టీ20ల్లో ఫస్ట్‌ డౌన్‌ ఇన్నాళ్లూ ఆడిన విరాట్‌ ఇప్పుడు ఓపెనర్‌గా వచ్చి దారుణంగా విఫలమవుతున్నాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో విమర్శలు వస్తున్నా మేనేజ్‌మెంట్‌ ఇంకా ఓపెనర్‌గానే పంపుతోంది. ఆస్ట్రేలియాతో మ్యాచులోనూ అతను విఫలమైన నేపథ్యంలో సెమీస్‌లో విరాట్‌ తిరిగి ఫస్ట్‌ డౌన్‌లోకి పంపిస్తారని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే శివమ్‌ దూబె స్థానంలో యశస్వి జైస్వాల్‌ తుది జట్టులోకి రావొచ్చు. 

జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా సరిపోదు. పరుగులను నియంత్రిస్తూనే 11 వికెట్లు తీశాడు. ప్రతి మ్యాచ్‌లో తనకంటూ స్పెషల్ మార్క్‌ను చూపిస్తున్నాడు. కుల్‌దీప్, అర్ష్‌దీప్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మద్దతుగా నిలిచారు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అర్ష్‌దీప్‌. ఇప్పటివరకు 15 వికెట్లు తీశాడు. మరోసారి వీరంతా విజృంభిస్తే ఈసారి ఇంగ్లాండ్‌ను చిత్తు చేయడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఆ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్‌ సాల్ట్, జానీ బెయిర్‌స్టో వంటి హిట్టర్లతో జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక బౌలింగ్‌ కూడా జొర్డాన్‌, అదిల్‌ రషీద్, మొయిన్‌ అలీ, కరన్, ఆర్చర్‌తో బలంగానే ఉంది. అయినా, ఆసీస్‌పై చూపిన పోరాటం మరోసారి పునరావృతమైతే భారత్‌ ‘ఫైనల్‌’కు చేరడం సుసాధ్యమే.

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని