IND vs ENG: ఈ ఒక్క గండం గట్టెక్కితే చాలు..!

టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లో భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గయానా వేదికగా గురువారం రాత్రి మ్యాచ్‌ జరగనుంది.

Published : 26 Jun 2024 18:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పదిహేడేళ్ల నిరీక్షణకు తెరపడాలంటే భారత్‌ అజేయంగా మరో రెండు అడుగులు వేస్తే చాలు. అయితే, అందులో అతిపెద్ద గండం ఇంగ్లాండ్‌ రూపంలో ఎదురైంది. దీనిని అధిగమిస్తే ఛాంపియన్‌గా నిలవడం పెద్ద కష్టం కాదనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. కీలక సమయంలో దూకుడు ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ను అడ్డుకోవాలంటే ఇంకాస్త శ్రమించాల్సిందే. 

హోరీహోరీ తప్పదు..

  • గత వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఆసీస్‌ మనల్ని ఓడించింది. దానికి ప్రతీకారంగా ఈసారి పొట్టికప్ సూపర్‌-8 పోరులో కంగారూల జట్టును టీమ్‌ఇండియా చిత్తు చేసింది. 
  • ఇప్పుడు ఇంగ్లాండ్‌ వంతు వచ్చింది. రెండేళ్ల కిందట టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లోనే భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ టీమ్‌ గెలిచింది. దానికి రివెంజ్ తీర్చుకొనే అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. 
  • కెప్టెన్ రోహిత్ శర్మ తాను ఆడుతూ.. జట్టును విజయపథంలో తీసుకెళ్తున్నాడు. ఆసీస్‌పై 41 బంతుల్లోనే 92 పరుగులు చేసినట్లే.. ఇంగ్లాండ్‌ మీద కాసేపు విరుచుకుపడితే చాలు భారత్‌ విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. 
  • విరాట్ కోహ్లీ ఇక ఫామ్‌ను అందిపుచ్చుకొంటే తిరుగుండదు. సూర్య, రిషభ్‌, పాండ్య, దూబె కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్, కుల్‌దీప్‌, అక్షర్ పటేల్ సత్తా చాటడం  భారత్‌కు కలిసొస్తుంది. 
  • భారత్-ఇంగ్లాండ్‌ టీ20ల్లో 23 మ్యాచుల్లో తలపడ్డాయి. టీమ్‌ఇండియా 12, ఇంగ్లాండ్ 11 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక పొట్టి కప్‌లో ఇరు జట్లూ 4సార్లు తలపడగా..  రెండేసి విజయాలతో సమంగా నిలిచాయి. 
  • గయానా వేదికగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 127. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరీ తక్కువగా 95 పరుగులు మాత్రమే. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు పెద్దగా ఇబ్బందుల్లేవు. లక్ష్య ఛేదనకు దిగే టీమ్‌ మాత్రం బౌలర్ల నుంచి పెను సవాల్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
  • ఇంగ్లాండ్ కెప్టెన్ జోష్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, విల్‌ జాక్స్, లివింగ్‌స్టోన్, ఫిల్‌ సాల్ట్ నుంచి భారత బౌలింగ్‌ విభాగానికి పోటీ ఎదురు కానుంది. వీరిని బుమ్రా, అర్ష్‌దీప్‌ అడ్డుకోవడంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
  • ఈ టోర్నీలో ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రిస్‌ జొర్డాన్ హ్యాట్రిక్ తీసి ఊపుమీదున్నాడు. జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్‌ను భారత బ్యాటర్లు అడ్డుకోగలిగితే చాలు. వీరందరికీ మన ఆటగాళ్ల బలాలు, బలహీనతలపై ఓ అవగాహన ఉంది. 
  • గయానాలో వర్షం ముప్పు ఉంది. ఇప్పటికే అక్కడ వానపడుతోంది. మ్యాచ్‌ రద్దైతే మాత్రం టీమ్‌ఇండియాకు అడ్వాంటేజ్‌ కలుగుతుంది. లీగ్‌, సూపర్‌-8 స్టేజ్‌లో టాప్‌లో ఉండటమే దానికి కారణం. అప్పుడు నేరుగా భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది.
  • భారత కాలమానం ప్రకారం రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

తుది జట్లు (అంచనా): 

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా

ఇంగ్లాండ్‌ : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, క్రిస్ జొర్డాన్, జొఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, టోప్లే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని